
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దర్శకుడు క్రిష్‌తో చేయబోతున్న చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ ఢిల్లీలోని ఇండియా గేట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. కాగా సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రాలు కూడా ఇందులో డిజైన్ చేశారు. ఇక ఓ బైకు, దానిపై పెద్దబాలశిక్ష పుస్తకం, ఓ రోజా పువ్వుతో ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ను చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను ప్రస్తుతానికి PSPK28 టైటిల్‌తోనే పిలుస్తున్న చిత్ర యూనిట్, ‘ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు..’ అనే క్యాప్షన్‌తో ఆకట్టుకుంది.
మొత్తానికి గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌తో వస్తుందా, ఈ సినిమాలో పవన్ ఎలా కనిపిస్తాడా, మిగతా నటీనటులు ఎవరా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.