
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడి తమ ప్రాణాలను పోగ్గొట్టుకున్నారు. కాగా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే చాలా మంది ప్రముఖులు కరోనా నుండి కోలుకుంటున్నారు. కాగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
అయితే బాలు ఆరోగ్యం చాలా విషమంగా ఉందంటూ ఇటీవల ఆసుపత్రి వర్గాలు, బాలు కుమారుడు ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆయన డాక్టర్లు అందిస్తున్న వైద్యానికి బాగానే రెస్పాండ్ అవుతున్నాడని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఇక బాలు ఆరోగ్యం గురించి ప్రతి తెలుగువాడు ప్రార్ధిస్తున్నాడు. తన గానంతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బాలు, త్వరగా కోలుకోవాలని సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కోరుతున్నారు. ఈ క్రమంలో బాలుకు సన్నిహితుడు, ప్రముఖ నటుడు ఎం.మోహన్ బాబు తాజాగా బాలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తనకు బాలు చిన్ననాటి నుండే తెలుసని, ఆయనతో బాలు చాలా క్లోజ్‌గా ఉండేవాడని మోహన్ బాబు తెలిపాడు. ఆయన తనను శుపాల, భక్త అని పిలుస్తుంటాడని, మోహన్ బాబు అని చాలా అరుదుగా పిలుస్తారని చెప్పుకొచ్చాడు. ఇక ఒకానొక సందర్భంలో తనవద్ద భోజనానికి కూడా డబ్బులు లేకపోతే బాలు వద్ద రూ.100 తీసుకున్నాని, అది ఇంకా ఆయనకు తిరిగి ఇవ్వలేదని మోహన్ బాబు చెప్పారు. ఈ విషయంపై బాలు సరదాగా తనకు బాకీ పడిన విషయాన్ని తరుచూ గుర్తుకు చేస్తుంటాడని మోహన్ బాబు అన్నారు. అలాంటి బాలు ఇప్పుడు కరోనాతో పోరాటం చేస్తున్నాడని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధి్స్తున్నానంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.