
తమిళ హీరో విశాల్ గతకొంత కాలంగా వరుస వివాదాలతో సతమతమవుతున్నాడు. అటు సినిమాలతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఎన్నికల్లో విశాల్‌ను పలువురు వరుసగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ పెద్దగా పట్టించుకోని ఈ హీరో ఏకంగా తనను మోసం చేశాడంటూ ఓ హీరోయిన్ ఇప్పుడు కామెంట్ చేయడం కోలీవుడ్ వర్గాలను షేక్ చేస్తోంది. ఇటీవల వరుసగా తమిళ హీరోలపై వివాదాస్పద కామెంట్లు చేస్తున్న మీరా మిథున్, తాజాగా విశాల్‌పై వివాదాస్పద కామెంట్లు చేసింది.
గతంలో విశాల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, అయితే తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అందుకే ఇంట్లో కూడా విశాల్‌ను పెళ్లాడమని బలవంతం చేశారని ఆమె అంటోంది. కానీ తనకు ధనవంతులను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేకపోవడంతో విశాల్‌ను చేసుకోనని తేల్చి చెప్పేసినట్లు ఆమె అంటోంది. ఇలా ఓ స్టార్ హీరో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆమె వెంట పడ్డాడని మీరా మిథున్ అంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే హీరోలపై కామెంట్లు చేయడం అమ్మడికేమీ కొత్త కాదని తెలుస్తోంది. గతంలోనూ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మీరా మిథున్ పలు ఆరోపణలు చేసింది. కాగా కోలీవుడ్‌కు చెందిన పలువరు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఇలా విశాల్‌పై ఆమె కామెంట్స్ చేయడంతో వీటిని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి మీరా మిథున్ కామెంట్లపై విశాల్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.