
యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ రెండు చిత్రాలను అనౌన్స్ చేశాడు. మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్’లో నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా మైథలాజికల్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఇందులో భారీ క్యాస్టింగ్ ఉండనుంది. అయితే ఎప్పటినుండో ప్రభాస్ చిత్రంలో నటించాలని కోరికగా ఉందంటోంది మంచు లక్ష్మీ. తనదైన యాక్సెంట్తో పాటు పర్ఫార్మెన్స్తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ, ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో ఏదైనా ఓ పాత్రలో నటించాలని ఉందంటోంది.
భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సూర్పనఖ పాత్రలో మంచు లక్ష్మీ అయితే బాగుంటుందని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. అతడికి బదులిస్తూ ‘వావ్.. నేను రెడీ.. ఎక్కడ సైన్ చేయమంటారో చెప్పండి’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం యావత్ భారతదేశ దృష్టిని ‘ఆదిపురుష్’ చిత్రం తనవైపు తిప్పుకుందని, అలాంటి ప్రెస్టీజియస్ చిత్రంలో ఏపాత్రలో నటించడానికైనా తాను రెడీ అంటోంది ఈ బ్యూటీ. మరి మంచు లక్ష్మీ కోరికను ప్రభాస్ తీరుస్తాడా లేడా అనేది చూడాలి.