ఈరోజుల్లో బయోపిక్ ల హవా నడుస్తుంది. చిత్ర పరిశ్రమ వారు ముందు తరాల వారికి ఆదర్శకంగా ఉండేలా తీస్తున్న ప్రయత్నంగా చెప్పవచ్చు. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ యొక్క మరో భాగం ‘మహానాయకుడు’ ఈనెల 22న విడుదలకి సిద్దమవుతుంది. అలాంటి ప్రయత్నము లోనే గొప్ప దర్శకుడు పద్మ శ్రీ కళాతపస్వి కె. విశ్వనాథ్ జీవిత చరిత్రను ‘విశ్వదర్శనం’ సినిమా పేరు మీదుగా ప్రేక్షకులకు అందచేస్తున్నారు. తాజాగా కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై జనార్థన్ మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ అనే సినిమాకు ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ’ ట్యాగ్ తో విశ్వనాథ్ జీవితచరిత్రను టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల రూపొందిస్తున్నారు.
ఈ టీజర్ లో ముందుగా ‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుని కథ’ అంటూ స్క్రీన్ మీద మొదలై ఆ దర్శకుని గొప్పతనాన్ని గూర్చి తెలియజేస్తూ, తనికెళ్ళ భరణి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఎస్.పి శైలజ, రాధిక, ఆమని, డా. బివిపట్టాభిరామ్ తదితరులు ఆ మహానుబావుని గూర్చి కొనియాడారు. అందులో ఎస్.పి శైలజ విశ్వనాథ్ గూర్చి చెప్తూ ‘ఆయన సినిమా లకు వెళ్తున్నాము అంటే భక్తి తో వెళ్తాము’ అని చెప్పారు. డాక్టర్ పట్టాభి రామ్ ‘సమాజాన్ని హిప్నటైజ్ చేశారు’ అని తెలిపారు.
వెండి తెర వల్ల విశ్వనాథునికి, విశ్వనాథుని వల్ల వెండి తెరకు గౌరవం పెరిగింది. సినిమా అనేది కేవలం కాలక్షేపం కోసం కాదని, మానవాళికి మంచి చేసే సాధనం కూడా అని అయన నిరూపించారు అంటూ 5 నేషనల్ అవార్డ్స్ ,6 నంది అవార్డ్స్, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 20 అథర్ హానర్స్, డాక్టరేట్, పద్మ శ్రీ-1992, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు -2017 ల పోటోలను టీజర్లో చూపించారు.
చివరగా కళా తపస్వి విశ్వనాథ్ మాట్లాడుతూ ‘నేను సినిమా అనేటటువంటి ఒక బస్సు పట్టుకుని, సినిమా చూసే ప్రేక్షకులు అనే వాళ్లు భక్తులు అనుకుని, నేను ఒక బస్సు నడిపే డ్రైవర్ని నేనేం చేయాలి నేను’ అని చెప్పడం వెనక సినిమా పై అతని కున్న తపనను తెలియ చేయవచ్చు.