మహారాష్ట్ర పుణెలోని కుంద్వాలో ఘోర విపత్తు చోటుచేసుకుంది. భారీ వర్షం ధాటికి ఈ తెల్లవారుజామున గోడకూలి 17 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. పెద్ద భవంతికి చెందిన కాంపౌండ్ వాల్ కూలి కాంప్లెక్స్ గోడను ఆనుకుని వలస కూలీలు నివసిస్తున్న రేకులషెడ్లపై పడింది.
అందరూ నిద్రిస్తోన్న తెల్లవారు జామున ఘటన జరగడంతో షెడ్లలో ఉన్న వారంతా అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. మృతులంతా బిహార్, బెంగాల్‌కు చెందిన భవన నిర్మాణ కూలీలేనని తెలుస్తోంది. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
శిథిలాల కింద కార్లు, ఆటోలు చిక్కుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లెయిన్ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.
అటు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు కూలిపోవడంతో విద్యుత్ కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెగిన విద్యుత్ తీగలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.