
సినిమా రంగంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిపోదామని బోలెడన్ని ఆశలతో చాలా మంది అమ్మాయిలు హైదరాబాద్ చేరుకుంటారు. అయితే వారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తామని కొందరు, ఇప్పి్స్తామని మరికొందరు మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. ఇక సినిమా రంగంలో గతకొంత కాలంగా క్యాస్టింగ్ కౌచ్ విషయంపై రచ్చ సాగుతూ వస్తోంది. శ్రీరెడ్డి ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏకంగా అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది.
కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తన ఉద్యమాన్ని పక్కదారి పట్టించి చెన్నై వెళ్లిపోయింది. అయితే టాలీవుడ్లో ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి స్టార్ బ్యూటీలు ఎక్కువగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ స్వీటీ అనుష్క శెట్టి తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. ఏ రంగంలోనైనా క్యాస్టింగ్ కౌచ్ అనేది సాధారణమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటేనే ఆయా రంగాల్లో మనం నిలదొక్కుకుంటామని ఆమె చెప్పుకొచ్చింది. తనకు కూడా సినిమాల్లో వేధింపులు ఎదురయ్యాయని, అయితే తాను నిజాయితీగా, ముక్కుసూటిగా ఉండటంతో తనతో ఎవరు తప్పుగా ప్రవర్తించలేకపోయారని అనుష్క చెప్పుకొచ్చింది.
ఇక హీరోయిన్లుగా రాణించాలంటే అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అనుష్క సూచించింది. కాగా ఆమె నటించిన తాజా చిత్రం నిశ్శబ్ధం ఇప్పటికే రిలీజ్కు రెడీగా ఉన్నా, థియేటర్లు మూతపడ్డ కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో అనుష్క ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.