అప్పుల బాధ ఒకవైపు, బ్యాంకు అధికారుల, వడ్డీ వ్యాపారుల వేధింపులు మరోవైపు.. వీటన్నిటిని తట్టుకోలేక అన్నదాతలు ఆత్మహత్యలను ఆశ్రయించారు. అప్పు తీర్చడం లేదని పేర్కొంటూ బ్యాంకు అధికారులు రైతు పొలంలో జెండాలు పాతడంతో తీవ్ర మనస్తాపనికి గురై అదే పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సరైన దిగుబడి, గిట్టుబాటు ధర లేక మరోరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందర్ని కలచి వేసింది.
జిల్లాలోని మార్టూరు మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన శేఖమూరి హనుమంతరావు (38), ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ప్రకాశం జిల్లాలోని ఈపురపాళెం గ్రామం దగ్గర్లో ఉన్న బోయినవారిపాళెంకు చెందిన ఆది నారాయణ కూడా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు.. ఒకే జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపింది.
రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు రైతుల నుంచి రుణాలు వసూలుచేసే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అటువంటి పద్ధతులను మార్చుకోవాలని అధికారులకు తెలియజేశామన్నారు.