
తిరుమల అంటే మనకు కలియుగ దైవం వెంకటేశ్వరుడు గుర్తుకొస్తాడు. ఆ తర్వాత అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే తిరుమల లడ్డూ అంటే అందరూ అంతలా ఎగబడుతుంటారు. ఆయా సేవలను బట్టి… చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తుంటారు. మరి… వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు… ఏడుకొండల వాడికి పూట పూటకో ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం ఉంటుంది. ఈ ఆసక్తికర విషయాలు చాలా మందికి తెలియదు.
కలియుగ దైవం ఏడుకొండల స్వామికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి…. ఏమి పెట్టాలి…. ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి….ఎవరు వండాలి…. ఎలా పెట్టాలి…. ఎవరు పెట్టాలి అనే అంశాలన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా తెలియజేశారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం….. మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు ఉపయోగించరు. ప్రసాదం వండేవాళ్లు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన కూడా చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక… శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

ఇక స్వామివారికి నైవేద్యం ఎలా పెడతారు అంటే….ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామికి ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే…. గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు……. ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు ……స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. అంటే దీన్ని స్వామివారికి గోరు ముద్దలు తినిపించడం అంటారు.
పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే…… సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ….. ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. దీనిని స్వామికి భోజనానికి పిలుపుగా భావిస్తారు. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం…. రాత్రి ఏడు – ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా….. శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.
ఉదయం బాలభోగం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక మధ్యాహ్నం రాజభోగం చేస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి నైవేద్యంగా శుద్ధాన్నం, పులిహోరా, గూడాన్నం, దద్దొజనం, చక్కెరన్నం అందిస్తారు. ఇక రాత్రి పూట శయనభోగం. ఈ సేవలో భాగంగా స్వామివారికి నైవేద్యంగా మిరియాల అన్నం, దోసె, లడ్డూ, వడ, శాకాన్నం అందిస్తారు. ఇక అల్పాహారాల కింద లడ్డూ, వడ, అప్పం, దోసె సమర్పిస్తారు. ఇక స్వామివారికి అందజేసే నైవేద్య మెనూ ఎలా ఉంటుందంటే….ఆయా సమయాలను బట్టి మారుతూ ఉంటుంది. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన…… చిక్కని వెన్న నురుగు తేలే, ఆవుపాలు సమర్పిస్తారు.

తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత….. నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత….. రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి… స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు. అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.
స్వామివారి ప్రసాదం తయారీకి ఏమీ ఏమీ ఉపయోగిస్తారు అంటే…బియ్యం, ధాన్యాలు, ఆవు పాల పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు… ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోస్తారు. హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి. ఇలా ఏడుకొండలపై వెలసిన శ్రీవారికి నిత్యం పూజాకైంకర్యాలు జరుగుతు ఉంటాయి.