కుదువ పెట్టిన బంగారం కుప్పలు తెప్పలుగా…

బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. ప్రముఖ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విలువ దాదాపు రూ.404 కోట్లు. సాధారణంగా బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఏడాది కాలావధికి రుణాలు తీసుకుంటారు. గతేడాది లాక్‌డౌన్‌లు ముగిశాక, ఆర్థిక అవసరాల కోసం మూడో త్రైమాసికంలో పసిడి తనఖా రుణాలను ఎక్కువగా తీసుకున్నారని సమాచారం. అంటే వచ్చే సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకులు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. గత ఏడాది కరోనా మొదటి దశ వల్ల ఎదురైన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో బంగారం విలువపై 90శాతం వరకు రుణం ఇచ్చేందుకు ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది. బంగారం ధర జీవిత కాల గరిష్ఠానికి గ్రాము రూ.5600కు పైగా చేరడంతో గత ఏడాదిలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అధికమొత్తం రుణంగా ఇచ్చాయి. తదుపరి బంగారం ధర తగ్గింది. కొవిడ్‌ రెండోదశ వల్ల ప్రజల ఆర్థిక స్థితి మెరుగవ్వలేదనే అంచనాలున్నాయి. అందువల్ల బకాయి తీర్చి, ఆభరణాలు విడిపించుకునే పరిస్థితి ఎక్కువమందికి ఉండదని భావిస్తున్నారు. ఈ పరిణామమే ఆర్థికసంస్థల మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది.

Gold Reuters

ప్రభుత్వ బ్యాంకులు కూడా విరివిగా పసిడి తనఖా రుణాలివ్వడంతో, గత ఆర్థిక సంవత్సరంలో సంఘటిత రంగమే దాదాపు రూ.2 లక్షల కోట్ల దాకా పసిడి తనఖా రుణాలిచ్చింది. ఇందులో రూ.1.2లక్షల కోట్ల వరకు ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వగా మిగతా రూ.80వేల కోట్లను ఎన్‌బీఎఫ్‌సీలు అందించాయి. కొన్నేళ్ల క్రితం చూస్తే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పసిడి తనఖా రుణాలను ఏడాదికి రూ.3000 కోట్ల మేర ఇస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగమే రూ.20000 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇలా ఇచ్చిన రుణాలు రూ.1.6లక్షల కోట్లుగా ఉన్నాయి. బంగారం తనఖా రుణాల మార్కెట్‌ విలువ రూ.6లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.