హుజూరాబాద్ ఉప ఎన్నికలో అందరూ ఊహించిన విధంగానే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.

సమీప అభ్యర్థిపై 23,865 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఈటల రాజేందర్.

ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఓటమి తెలియని నేతగా రికార్డు నమోదు చేశారు.

ఆరుసార్లు టీఆర్ఎస్ నుంచి, ఏడోసారి బీజేపీ తరఫున గెలుపొందారు.

‘చంపుకుంటారా.. నన్ను సాదుకుంటారా.. మీ ఇష్టం’ అన్న ఈటల రాజేందర్ ను గెలిపించి.. ‘సాదుకుంటాం’అని చెప్పకే చెప్పారు.

2002లో ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం మొదలైంది.

పౌల్ట్రీ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ లో సెటిల్ అయిన రాజేందర్ 2002లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. 

2004లో కమలాపూర్ నుంచి పోటీ చేయాల్సిందిగా కేసీఆర్ కోరారు.

టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఢీకొని  ఈటల ఘన విజయం సాధించారు.

కేసీఆర్ పిలుపుతో 2008లో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు.

అప్పటి ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు.

శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్ రద్దవడంతో 2009లో హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది.

2009 నుంచి 2021 వరకు జరిగిన సాధారణ, ఉప పోరులో ఈటల హుజూరాబాద్ నుంచి ఐదుసార్లు విజయం సాధించారు.

జహీరాబాద్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాగారెడ్డి రికార్డును ఈటల సమం చేశారు.