తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తుంటారు.

భక్తులకు దర్శనం అవ్వడంతో పాటు వసతి సౌకర్యం దొరకడం కూడా ఒక్కోసారి కష్టమవుతోంది. 

ముఖ్యంగా తిరుమలలో గదుల కేటాయింపులో దళారీల వ్యవస్థ  ఉండటంతో చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రూమ్ బుకింగ్స్​తో పాటు ఉచిత లడ్డూ ప్రసాద వితరణలోనూ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమల్లోకి తీసుకొచ్చింది. 

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ తగ్గడమే గాక, దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతోందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 

ఒకసారి ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల అనంతరమే రూమ్​ పొందే అవకాశం ఉంటుందని ధర్మారెడ్డి చెప్పారు. 

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాద వితరణలోనూ ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా అక్రమాలను అరికట్టామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

ఇకపై క్యూకాంప్లెక్స్​లో ఉచిత లడ్డూలు కావాలంటే మనిషి రావాల్సిందేనని ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.

మనిషి లేకుండా లడ్డూ రాదని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో సత్ఫలితాలు వస్తున్నాయని.. దీన్ని అడ్వాన్స్, కరెంట్ బుక్సింగ్స్​లోనూ వాడతామని ధర్మారెడ్డి వివరించారు.

తిరుమలలో భక్తులకు నెలకు ఒక్కసారే గదులు కేటాయించడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరి.. నూతన సాంకేతికత ద్వారా గదుల కేటాయింపులో టీటీడీ తీసుకొచ్చిన మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.