ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటే, వ్యాయామం చేస్తే సరిపోదు. కంటికి సరిపడా నిద్ర కూడా ఉండాలి.

ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోతే మరుసటి రోజు ఉదయం ఏ పనీ చేయలేం.

ఎందుకంటే మనిషికి శారీరక, మానసిక అలసట దూరమవ్వాలంటే సరిపడా నిద్ర ఉండాల్సిందే.

అలాగని అతినిద్ర కూడా మంచిది కాదు. రోజుకు 8 గంటల నిద్రపోతే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో  ఒక పని చేస్తూ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోతున్నారు. 

రాత్రి త్వరగా పడుకుంటే శరీరానికి కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది. కానీ కొందరు మాత్రం ఫోన్లు చూసుకుంటూ ఏ అర్ధరాత్రో పడుకుంటారు.

కొందరైతే అదేపనిగా తెల్లార్లూ వర్క్​లోనే బిజీగా ఉంటారు. 24 గంటలు తీవ్రంగా పని చేస్తూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు.

శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అవసరమని.. అందుకు నిర్ణీత గంటలు నిద్రపోవడమే మార్గమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఒక్కరోజు నిద్రపోకుండా ఉన్నా తీవ్ర ప్రమాదమని.. ఆ ప్రభావం వయసు మీద పడుతుందని జర్మనీకి చెందిన ఓ విశ్వవిద్యాలయం తన అధ్యయనంలో పేర్కొంది.

జర్మనీకి చెందిన ఆర్​డబ్ల్యూటీహెచ్ అచెన్ యూనివర్సిటీ 19 నుంచి 39 ఏళ్ల వయస్సు గల 134 మందిపై ప్రయోగాలు చేశారు.

అచెన్ వర్సిటీ ప్రయోగంలో తేలింది ఏంటంటే.. ఒక్క రాత్రి నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్ రెండేళ్లు ఫ్రీజ్ అవుతుందట.

నిద్రపోయిన రోజులతోపాటు, నిద్రలేని రాత్రుల్లో ఎంఆర్​ఐ స్కాన్ ద్వారా బ్రెయిన్ ఏజ్​ను పరిశీలించారు సైంటిస్టులు.

నిద్రానష్టం  వల్ల యువకుల్లో వృద్ధాప్యం లాంటి సమస్యలు తలెత్తుతాయని తాము గుర్తించామని పరిశోధకులు తెలిపారు.