కిడ్నీలు రాళ్లు ఏర్పడే కేసులు ఈమధ్య బాగా పెరిగాయి. లైఫ్ స్టైల్ వల్ల ఏర్పడే ఈ సమస్యతో చాలా మంది సతమతమవుతున్నారు.

ఇదిలాఉండగా.. బీర్లు ఎక్కువగా తాగితే కిడ్నీలు రాళ్లు తగ్గుతాయనే అపోహ చాలా మందిలో ఉంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 

అయితే ఇది అత్యంత ప్రమాదకరమైన వదంతని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఈ నెల 9న వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా హెల్త్ కేర్ స్టార్టప్ ప్రిస్టిన్ కేర్, హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ లైబ్రేట్ డేటా ల్యాబ్​ కలసి కిడ్నీ హెల్త్‌పై ఓ సర్వే నిర్వహించాయి.

భారత్​లో కిడ్నీల ఆరోగ్యంపై ప్రజల్లో ఏమేర అవగాహన ఉందో తెలుసుకునేందకు 1,000 మందిపై అధ్యయనం నిర్వహించారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు బీర్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవని చెప్పారు.

ఒకవేళ కిడ్నీలో రాళ్లు ఉన్నా బీర్లు తాగితే కరుగుతాయని అనడం గమనార్హం. 

కిడ్నీలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయని అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 50 శాతం మందికి తెలియదు.

బీర్లు తాగితే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయనే అపోహపై వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. 

ఇందులో వాస్తవం లేదని.. ఇది పూర్తిగా కల్పితమేనని చెప్పారు.

ఆ సర్వే ప్రకారం.. కిడ్నీలో రాళ్ల సమస్య ట్రీట్​మెంట్​ను 50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నారు. దాన్ని ఏకంగా రెండేళ్లకు పొడిగిస్తున్నారు. 

ఇక, కిడ్నీ రోగాలకు సంబంధించి అధికారిక గణాంకాలు లేకపోయినప్పటికీ ఈ కేసుల్లో పెరుగుదల హెచ్చుస్థాయిలో ఉందని లైబ్రేట్ ఆన్​లైన్ అపాయింట్​మెంట్స్ డేటా పేర్కొంది. 

2021తో పోలిస్తే 2022లో కిడ్నీ రోగాలకు సంబంధించి వైద్యుల అపాయింట్​మెంట్లు తీసుకోవడం ఏకంగా 180 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళలతో పోల్చితే పురుషులే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారని తేలింది. 

కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల ముఖ్యంగా ఊబకాయం, హైపర్ టెన్షన్ లాంటి సమస్యల బారిన పడే ముప్పు ఉందని హెల్త్ ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు.