ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలుగా పేరు పొందిన పలు కంపెనీల్లో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.
ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్ వంటి కంపెనీల్లో.. భారతీయుల హవా కొనసాగుతోంది.
తాజాగా ఈ జాబితాలో చేరడానికి మరో భారతీయుడు అడుగు దూరంలో ఉన్నాడు.
ఆయనే ఇండో అమెరికన్ అజయ్ బంగా. ప్రస్తుతం అతడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఉన్నాడు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను ఈ పదవికి స్వయంగా నామినేట్ చేయడం విశేషం.
అజయ్ బంగా.. భారతదేశం, పుణేలో జన్మించాడు. ఆయన తండ్రి ఆర్మీ జనరల్.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేశాడు.
ఆ తర్వాత 1981లో నెస్లే కంపెనీ కోల్‌కతా బ్రాంచ్ మేనేజర్‌గా బంగా తన కెరీర్ ప్రారంభించారు.
1996లో అమెరికాకు వలస వెళ్లి పెప్సికోలో చేరారు.
ఆ తర్వాత 2009లో అజయ్ మాస్టర్ కార్డు కంపెనీ సీఈఓగా విధులు నిర్వహించారు.
మాస్టర్‌కార్డు కంపెనీలో చేరడానికి ముందు ఆయన సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహారాలు చూసేవారు.
ఇక బంగా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది.
ప్రస్తుతం అజయ్ బంగా జనరల్ అట్లాంటిక్ అనే ఈక్విటీ సంస్థకు వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
ఇక వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్.. త్వరలోనే పదవి నుంచి తప్పుకుంటానని ప్రటించాడు.
వాస్తవానికి డేవిడ్ మాల్పస్ పదవీ కాలం 2024 చివర వరకు ఉండగా.. రెండేళ్ల ముందే ఆయన తప్పుకుంటున్నారు.
మార్చి 29 వరకు ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
అనంతరం ఓటింగ్‌లో బోర్డులోని డైరెక్టర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారే అధ్యక్షుడవుతారు.
మరి బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అవుతారో లేరో మరో నెల రోజుల్లో తెలియనుంది.