ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుగు ప్రజలలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
పురణాలు, హైందవ సంస్కృతి.. వంటి వాటి గురించి ఎంతో చక్కగా.. సామాన్యులకు కూడా అర్థం అయ్యే రీతిలో వివరిస్తూ.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి అప్పగించింది.
టీటీడీ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తోన్న పారాయణ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యతను చాగంటి కోటేశ్వరరావుకు అప్పగించింది.
చాగంటి వ్యక్తిగత వివరాల సంగతి వస్తే.. ఆయనది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ. తల్లిదండ్రులు సుందర శివరావు, సుశీలమ్మ.
1959 జూలై 14వ తేదిన ఇతను జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం ఉంన్నారు.
చాగంటి మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనం చేశారు.
ఆ తరువాత వాటిలోని సమాచారాన్ని తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తున్నారు.
చాగంటి.. 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణం, 42 రోజుల పాటు భాగవతం, 30 రోజుల పాటు శివ మహా పురాణం, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రములను ప్రవచించి ప్రశంసలు పొందారు.
చాగంటి ధారణాశక్తి చాలా గొప్పది. ఆయన ఒక్కాసారి జగద్గురు ఆది శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే చాలు.. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో తడుముకోకుండా చెప్పగలరు.
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చాగంటిని కలిశారు. ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు.
చాగంటి సుమారు 163 అంశాలపై ప్రవచనాలు చెప్పారు.
కంచి కామకోటి పీఠం చాగంటిని సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసింది.
అలానే 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు చాగంటికి గౌరవ డాక్టరేట్ బహుకరించారు.
మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారు 2014 లో చాగంటికి వాచస్పతి (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను అందించారు.
పిన్నమనేని పురస్కారం కూడా అందుకున్నారు చాగంటి.
ప్రస్తుతం చాగంటి కోటేశ్వరరావు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేస్తున్నారు.
చాగంటి ఇప్పటి వరకు ప్రవచనాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు.
ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే సొంత డబ్బుతోనే వెళ్తారు.
ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కల చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి ఇవ్వడం నిజంగా సంతోషకరమైన అంశం.