మొదటిసారి పేరెంట్స్ అయిన వారికి పిల్లల పెంపకం చాలా కష్టంగానే ఉంటుంది. పిల్లలను ఎలా చూసుకోవాలి? ఎలాంటి ఫుడ్ పెట్టాలన్న వాటిపై క్లారిటీ ఉండదు.
ఎదుగుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్నే పెట్టాల్సి ఉంటుంది.
పిల్లలకు పాలు కాకుండా ఇతర ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ముఖ్యమైన పోషకాలను అందిస్తూ ఉండాలి. పోషకాలే వారి శారీరక, మానసిక ఎదుగుదలకు సహాయపడతాయి.
అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అంటూ పెద్దలు తినే వాటిని కూడా తినిపిస్తుంటారు. కానీ పిల్లలకు హానిచేసే ఆహారాలు చాలానే ఉన్నాయి.
అందుకే సంవత్సరం వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటివి పెట్టకూడదు అన్న విషయాలను ముందుగా తెలుసుకోవడం మంచిది.
మొదటి కొన్ని నెలలు గడిచిన వెంటనే చిన్న పిల్లలకు ఘన ఆహారాలను తినిపించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి జీర్ణక్రియకు వీటిని అరిగించుకునే సామర్థ్యం ఉండకపోవచ్చు.
ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే పెట్టండి. ఈ వయసు పిల్లలకు తల్లిపాలే పోషకాహారం.
సాధారణంగా పుట్టి ఆరునెలల తర్వాతే పిల్లలకు ఘన ఆహారాన్ని ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. వారి శారీరక ఎదుగుదల, అభివృద్ధిని గుర్తుంచుకునే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.
సరిగ్గా వండిన లేదా మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలను, కూరగాయలను, జున్ను, అరటిపండ్లను, బఠానీలను తినిపించొచ్చు. సరిగ్గా పండని లేదా ఉడికించని వాటిని అసలే ఇవ్వకూడదు.
ముఖ్యంగా వండని ముడి క్యారెట్లు లాంటి కూరగాయలను చిన్న పిల్లలకు తినిపించకూడదు. ఎందుకంటే ముడి కూరగాయల్లో నైట్రేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
దీనివల్ల పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వీటికి బదులుగా వారు సులువుగా తినేంత చిన్న సైజులో పండ్లను కట్ చేసి ఇవ్వండి.
సంవత్సరం వయసున్న పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ని అసలే తినపించకూడదు. గింజలు, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేరు శెనగలు, మరే డ్రై ఫ్రూట్స్ అయినా సరే పిల్లలకు వీటిని తినిపించకూడదు.
ఎందుకంటే ఏడాది వయసున్న పిల్లల అన్నవాహిక చిన్నగా ఉంటుంది. ఇవి అక్కడ ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. తద్వారా ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు.
చాక్లెట్లలో కెఫిన్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను చాక్లెట్లకు దూరంగా ఉంచాలి. ఈ చాక్లెట్లను పిల్లలు తింటే కొన్ని కొన్నిసార్లు అలెర్జీ కూడా రావొచ్చు.
గుడ్లు మంచి పోషకాహారమే. కానీ పిల్లలకు తినిపించే ముందు ఒక సారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే గుడ్లు అలెర్జీకి కూడా దారితీయొచ్చు.
ప్రతి పిల్లవాడి పోషణ అవసరం భిన్నంగా ఉంటుంది. అందుకే వారి ఫీడింగ్ విషయంలో ఆరోగ్య నిపుణుల సలహాలను తీసుకోవడం ఉత్తమం.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.