బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో భారత యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ద్విశతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అది నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అతను కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేశాడు.
85 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్న ఇషాన్.. 126 బంతుల్లోనే ద్విశతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఫోర్లు, సిక్సుల ద్వారానే 146 పరుగులు వచ్చాయి.
ఇదిలావుంచితే.. ఇషాన్ తాను ఔట్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా త్రిశతకం సాధించేవాడినని అని తెలిపాడు. తనను కోహ్లీ శాంతపరిచాడని చెప్పుకొచ్చాడు.
ఇషాన్ కిషన్ 90ల్లో ఉన్నప్పుడు సిక్స్ కొట్టి సెంచరీ చేయాలనుకున్నాడట. కానీ, విరాట్ కోహ్లీ వారించడంతో సింగిల్స్ తీశాడట. “సిక్స్ కొట్టి సెంచరీ చేయాలనుకున్నా. అయితే.. కోహ్లీ అలా చేయకు.. ఇది నీ మొదటి సెంచరీ.
సింగిల్స్ తీయి అని చెప్పాడు..” అని ఇషాన్ తెలిపాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన ఇషాన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ ఇషాన్. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఫీట్‌ను సాధించారు.
వన్డేల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ చేయగా, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ ఒక్కోసారి డబుల్ సెంచరీ బాదారు.
మొత్తంగా 131 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 24 ఫోర్లు, 10 సిక్సర్లు సాయంతో 210 పరుగులు చేశాడు.
ఇక భారత ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఇషాన్.. తాను మరికొంతసేపు గనక క్రీజులో ఉంటే ట్రిపుల్ సెంచరీ పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చాడు. “పిచ్ బ్యాటింగ్ కు సహకరించింది.
క్రీజులో ఉన్నంతవరకు నా మైండ్ లో ఒక్కటే ఆలోచన. బంతి బాదడానికి అనువుగా ఉంటే బాదేయడమే. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా నా పేరు దిగ్గజాల సరసన ఉండటం నా అదృష్టం.
నమ్మలేకపోతున్నా. ఒకవేళ నేను అవుట్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రిపుల్ సెంచరీ చేసేవాడిని. ఎందుకంటే.. అప్పటికి 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి.. ” అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.