తమిళ హీరో విష్ణు విశాల్‌కు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో డబ్‌ అవుతూ ఉంటాయి.

విష్ణు విశాల్‌ ఇప్పటివరకు దాదాపు 20 సినిమాలు తీస్తే అందులో చాలా వరకు మాస్‌, పల్లెటూరి నేపథ్యం కలిగిన సినిమాలు కావటం విశేషం.

అంతేకాదు.. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాతోనే ఆయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు.

 ఇక, తనకు ఎంతో గానో అచ్చొచ్చిన స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా ‘‘మట్టి కుస్తీ’’తో శుక్రవారం మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు విష్ణు విశాల్‌.

కథ :  కీర్తి( ఐశ్వర్య లక్ష్మీ) కేరళకు చెందిన ఓ సగటు ఆడపిల్ల. ఆమెకు కుస్తీ పోటీలంటే చాలా ఇష్టం.

ఇంట్లో వాళ్లు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటారు. అయినప్పటికి చిన్నాన్న సహాయంతో కుస్తీ పోటీలకు వెళుతుంటుంది.

ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు గొడవ పెడతారు. పెళ్లి చేసుకోమని బలవంతపెడతారు. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తుంది.

ఇక, ఆంధప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్‌) ఊర్లో బలాదూర్‌గా తిరిగే మాస్‌ వ్యక్తి.

అతడి కంటూ ఎలాంటి ఆశయాలు ఏవీ ఉండవు. వచ్చే భార్య తను చెప్పినట్లు చేసేది అయితే చాలు అనుకుంటాడు.

కీర్తికి ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్న ఆమె చిన్నాన్నకు ఓ ఆలోచన వస్తుంది.

 కీర్తి ఏడవ తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్ధం చెప్పి వీరతో పెళ్లి చేస్తారు. పెళ్లయిన కొన్ని రోజులు బాగానే ఉంటారు.

తర్వాత కీర్తి గురించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.

ఆమె ఓ కుస్తీ ఫైటర్‌ అని, బాగా చదువుకుందని, పెద్ద జడకూడా లేదని వీరకు తెలుస్తుంది.

దీంతో ఇ‍ద్దరూ విడిపోతారు. మళ్లీ ఈ ఇద్దరూ ఎలా కలిశారు? భార్య ఆశయానికి వీర తోడుగా నిలుస్తాడా? లేదా? అన్నదే మిగితా కథ.

పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్‌ డ్రామాలు రావటం కొత్తేమీ కాదు.

 అయితే, ఈ సినిమా కథను రాసుకోవటంలో.. దాన్ని ఎగ్జిక్యూట్‌ చేయటంలో దర్శకుడు సఫలమయ్యాడు.

మహిళల స్వేచ్ఛ అనే పాయింట్‌ మీద కథ మొత్తాన్ని నడిపించాడు. తమిళ సినిమాల్లో ఉండే ఫ్యామిలీ డ్రామాను అలాగే కంటిన్యూ చేశాడు.

కథలో వారి ప్రాధాన్యతకు తగ్గట్టు పాత్రలను ముందుకు నడిపించాడు. ప్రతీ పాత్రకు న్యాయం చేశాడు.

వీర పాత్రలో విష్ణు విశాల్‌ మరో సారి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక, కీర్తి పాత్రలో ఐశ్వర్య లక్ష్మీ చక్కగా నటించింది.

మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధికి తగ్గట్లుగా బాగా నటించారు.

ప్లస్ పాయింట్స్:  విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మీ నటన, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు

మైనస్ :  పాటలు

చివరి మాట :  మట్టి కుస్తీ.. ఎంటర్‌టైన్‌మెంట్‌ జాస్తి!

రేటింగ్‌ : 3/5