క్రికెట్‌ చరిత్రలోనే సంచలనం.. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదిన రుతురాజ్‌ గైక్వాడ్‌.

6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన యువరాజ్‌ రికార్డును రుతురాజ్‌ బద్దలు కొట్టాడు. 

ఆరు బంతుల్లో ఆరు సిక్సులతో పాటు నో బాల్‌ రూపంలో అదనంగా వచ్చిన బంతిని సైతం రుతురాజ్‌ స్టాండ్స్‌లోకి పంపించాడు.

ఈ అరుదైన ఫీట్‌.. ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీలో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్‌-మహారాష్ట్ర మధ్య జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రుతురాజ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

మహారాష్ట్ర కెప్టెన్‌ కమ్‌ ఓపెనర్‌ అయిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఉత్తర ప్రదేశ్‌ బౌలర్లను చీల్చి చెండాడు.

ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. చరిత్రలో కనీవిని ఎరుగని భారీ ఇన్నింగ్‌ ఆడాడు. 

159 బంతులాడిన రుతురాజ్‌ 10 ఫోర్లు, 16 సిక్సులతో ఏకంగా 220 పరుగుల భారీ స్కోర్‌ చేశాడు.

అయితే.. ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌లో మాత్రం సంచలనం నమోదు చేశాడు. 

యూపీ బౌలర్‌ శివసింగ్‌ వేసిన ఆ ఓవర్‌లో రుతురాజ్‌ విధ్వంసం సృష్టించాడు. 

తొలి నాలుగు బంతుల్లో రుతురాజ్‌ నాలుగు సిక్సులు కొట్టడంతో.. ఏం చేయాలో తెలియని బౌలర్‌ శివసింగ్‌.. ఐదో బంతిని నోబాల్‌గా వేశాడు. 

దాన్ని కూడా భారీ సిక్స్‌గా మల్చిన రుతురాజ్‌.. మరో రెండు బంతుల్లోనూ రెండు సిక్స్‌లు బాదేశాడు. 

సంచలన బ్యాటింగ్‌తో ఒక్క ఓవర్‌లో ఏకంగా 7 సిక్సులు కొట్టిన వీరుడిగా నిలిచాడు. 

దీంతో ఆ ఓవర్‌లో మహారాష్ట్రకు ఏకంగా 43 పరుగులు వచ్చాయి. 

అలాగే వన్డే మ్యాచ్‌లో రుతురాజ్‌ డబుల్‌ సెంచరీ చేయడం మరో విశేషం.