‘కూటి కోసం కోటి విద్యలు..‘ మనిషి ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ కడుపు నింపుకోవడానికి మాత్రమే అన్నది ఈ సామెత భావం.
ఈ వ్యాఖ్యానికి సరైన వ్యక్తిని నేనే అని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఓ వ్యక్తి.
‘సుఖాంత్ సర్వీసెస్’ అనే పేరుతో అంత్యక్రియల వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో లాభాలు గడిస్తున్నాడు.
ఏడాదికి రూ. 2000 కోట్ల టర్నోవర్ దిశగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాడు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్’ (IITF 2022)లో ఇతడి బిజినెస్ ఐడియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బుర్రకు కాస్త పదును పెట్టాలేగానీ.. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి అనడానికి ఈ వ్యాపారమే ఒక చక్కటి ఉదాహరణ.
‘సుఖాంత్ ఫ్యునెరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నడుస్తున్న ఈ సంస్థ అంత్యక్రియల సేవలన్నింటిని అందిస్తుంది.
ఈ సేవలకు ఆర్డర్ చేసుకోగానే మొదట మీ ఇంటికి ఒక బృందాన్ని పంపిస్తుంది.
వారు దగ్గరుండి మరీ అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు.
వీరిలో సాధారణ ఏర్పాట్లను చూసే సభ్యులతో పాటు, ఒక పంతులు, మంగళి ఉంటారు.
శవపేటికను మోసుకెళ్లడానికి ఆ నలుగురు కూడా ఉంటారు.
అంతిమయాత్ర కోసం కావాలంటే మరికొంత మందిని కూడా పంపిస్తారు.
ఈ మొత్తం సేవలకు ఈ సంస్థ రూ. 38000 ఛార్జ్ చేస్తోంది.