దేశవాళీ టోర్నీల్లో ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు బ్యాటర్ నారాయన్ జగదీశన్ సంచలనాలు నమోదు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఆదివారం తమిళనాడు-అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు భారీ స్కోర్ నమోదు చేసింది.
ఓపెనర్లు సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సాయి సుదర్శన్ 150 ప్లస్ స్కోర్‌తో అదరగొట్టగా.. జగదీశన్ ఏకంగా డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు.
141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సులతో 277 పరుగులు చేసి.. తృటిలో ట్రిబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో జగదీశన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. లిస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన ఆటగాడిగా జగదీశన్ నిలిచాడు.
ఈ రికార్డుతో పాటు మన దేశవాళీ క్రికెట్లో రోహిత్ శర్మ 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును సైతం జగదీశన్ ఈ ఇన్నింగ్స్‌తో బద్దలుకొట్టాడు.
అలాగే.. జగదీశన్‌కు ఇది వరుసగా ఐదో సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ఏ క్రికెట్లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడు జగదీశనే. విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్లో ఇప్పటికే వరకు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన జగదీశన్.. వరుసగా.. 5, 114, 107, 168, 128, 277 పరుగులు సాధించాడు.
ప్రపంచంలో మరే ఆటగాడికి కూడా లిస్ట్ ఏ వరుసగా ఐదు సెంచరీలు లేవు. అలాగే ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు చేసి ఆటగాడు కూడా జగదీశనే. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 4 సెంచరీల రికార్డును సైతం జగదీశన్ తుడిచేశాడు.
ఇక తన ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్‌తో కలిసి ఏకంగా 416 పరుగుల భాగస్వామ్య నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక భాగస్వామ్యం.
సాయి సుదర్శన్, నారాయన్ జగదీశన్ సృష్టించిన పరుగుల సునామీతో తమిళనాడు ఏకంగా 506 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయిన తమిళనాడు 506 పరుగులు టార్గెట్‌ను అరుణాచల్ ప్రదేశ్ ముందు ఉంచింది.
లిస్ట్ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్. ఇంగ్లండ్ లిస్ట్ ఏ క్రికెట్లో 498 పరుగులే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లిస్ట్ ఏ హైఎస్ట్ టోటల్. కానీ.. తాజాగా తమిళనాడు జట్టు ఆ రికార్డును సైతం బద్దలుకొడుతూ.. సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
ముఖ్యంగా జగదీశన్ సంచలన బ్యాటింగ్‌తో ఈ రికార్డు తమిళనాడు వశమైంది. కానీ.. ఈ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందే.. ఐపీఎల్ 2023 కోసం ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు జగదీశన్‌ను రిలీజ్ చేసింది.
2020లో జగదీశన్‌ను బేస్ ప్రైస్‌కు కొన్న సీఎస్కే పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ 2022లోనూ సీఎస్కే జగదీశన్‌ను కొనుగోలుచేసింది. మళ్లీ అతనికి సరిగ్గా అవకాశాలు ఇవ్వలేదు.
ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్ ఫామ్ చూస్తే.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో అతని కోట్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అతన్ని వదులుకుని తప్పు చేసిన సీఎస్కే ఆ తప్పును సరిదిద్దుకునేందుకు వేలంలో అతని కోసం పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.