ఓ 20-30 ఏళ్ల క్రితం వరకు దేని గురించి ఎలాంటి సమాచారం కావాలన్న.. లైబ్రరీలకు వెళ్లి.. పుస్తకాలు, పాత పేపర్లు తిరగేసి.. నోట్స్ రాసుకుని.. కావాల్సిన సమాచారం సేకరించేవాళ్లు.
కంప్యూటర్లు, ఇంటర్నెట్ డాటా, స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో పాటు పలు సర్చ్ ఇంజిన్‌లు వినియోగంలోకి రావడంతో.. మొత్తం ప్రపంచం మన చేతిలోకి వచ్చేసినట్లు అయ్యింది.
ఇక నేటికాలంలో అయితే వంటలు మొదలు.. ప్రతి దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్న.. గూగుల్ చేయడమే.
ఆఖరికి ప్రయాణాలు చేయాలన్న కూడా గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడుతున్నాం. ఇక మన జీవితంలో గూగుల్ ఓ భాగం అయ్యిందంటే ఆశ్చర్యం కాదు.
గూగుల్‌తో మనకు కలిగే మేలు సంగతి కాసేపు పక్కన పెడితే.. దాని మీద విమర్శలు కూడా బోలేడు.
మరీ ముఖ్యంగా ప్లే స్టోర్‌లో యాప్ డెవలపర్ల విషయంలో, న్యూస్ కంటెంట్ విషయంలో గూగుల్ వ్యవహార శైలీ మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా ఓ భారతీయ యువతి కృషి మూలంగా సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) గూగుల్‌పై 2,000 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించింది.
ఇంతకు సీఐఐ పని ఏంటంటే.. దేశంలోని వ్యాపార సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేట్టు చూడటం.. ఒక్క కంపెనీనే గుత్తాధిపత్యం చలాయించకుండా చూస్తుంది.
మన దగ్గర ఎక్కువగా వాడేది ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్‌లే. ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు.. కొన్ని యాప్‌లు డీఫాల్ట్‌గా వస్తాయి.
వాటిని డిలీట్ చేయడానికి కుదరదు. మనకు నచ్చినా, నచ్చకపోయినా.. అవి మన ఫోన్‌లో అలా ఉండిపోతాయి. వీటి వల్ల మనకు ఉపయోగం లేకపోగా.. స్పేస్ వేస్ట్ అవుతుంది.
మన ఫోన్‌లో ఉన్న వాటి కంటే మంచి యాప్స్ ఉన్నా.. వాటి గురించి మనకు తెలియదు. ఇలా జరగడానికి కారణం.. గూగుల్.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగించే మోబైల్ తయారీ సంస్థలుతో గూగుల్ చేసుకున్న ఒప్పందం కారణంగా ఇలా ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ వస్తున్నాయి.
అయితే సీఐఐ గూగుల్‌పై జరిమానా విధించడం వెనక ఉన్నది ఢిల్లీకి చెందిన యువతి సుకర్మాథాపర్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో ఉన్న ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లపై సుకర్మకు కూడా ఫిర్యాదులున్నాయి.
దీని గురించి ఆరా తీయగా.. ఇప్పటికే కొందరు ఈ యాప్‌ల గురించి ఫిర్యాదు చేసినట్లు సుకర్మకు తెలిసింది. దాంతో మరో ఇద్దరితో కలిసి.. దీనిపై లోతుగా అధ్యాయనం చేయడం ప్రారంభించింది సుకర్మ.
2018లో ఈ పరిశోధన ప్రారంభం అయ్యింది. రోజంతా ఉద్యోగం చేసుకుంటూనే ఇంటికి వచ్చాకా.. దీనిపై అధ్యయనం చేసేది.
ఈ క్రమంలో గూగుల్ ఒప్పందాలపై హార్వర్డ్ ప్రొఫెసర్ చేసిన ఒక అధ్యనం గురించి సుకర్మకు తెలిసింది. దాన్ని తీసుకుని పరిశీలించగా.. గూగుల్‌కు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు దొరికాయి.
వాటిని సీసీఐకు అప్పగించడంతో.. అది గూగుల్‌కి జరిమానా విధించింది.
నల్సార్ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసింది సుకర్మ.