చలి కాలం ప్రారంభం అయ్యింది. ఉదయం లేవాలంటే ఎంత బద్దకంగా ఉంటుందో కదా.
ఇక ఈ కాలంలో ఇంట్లో ఉంటేనే.. జలుబు, దగ్గు జ్వరాలు చుట్టు ముడతాయి. ఇక ప్రయాణాలు చేస్తే.. మరిన్ని ఇబ్బందులు.
శీతాకాలంలో ప్రయాణాలు మరీ ముఖ్యంగా విమానయానం సరిగా సాగదు. పొగమంచు కారణంగా విమనాలు ఎప్పుడు రద్దు అవుతాయో చెప్పడం కష్టం. రైళ్లు కూడా చాలా ఆలస్యం అవుతాయి.
ఇలాంటప్పుడు సమయం వృథా కాకుండా.. ప్రయాణం వాయిదా పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలంటున్నారు నిపుణులు.
ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకుంటే.. వీలైనంత వరకు ఒకే విమానం, రైలు, బస్సు వంటివి ఉండేలా చూసుకోండి.
మధ్యలో ఆగకుండా ఒకే సారి గమ్యం చేరేలా ప్లాన్ చేసుకొండి. ఇలా చేయడం వల్ల మధ్యలో దిగి.. మరో విమానం, రైలు కోసం ఎదురు చూసే పని ఉండదు.
మీరు బయలుదేరేముందే అక్కడి వాతావరణం ఎలా ఉందో కన్నుక్కొండి. పొగమంచు ఎలా ఉండబోతుంది..
లేట్ అయితే ఆయా సంస్థలు ప్రయాణికుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాయో తెలుసుకోండి.
ఎయిర్‌లైన్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండండి. చాలా రకాల ఎయిర్‌లైన్స్ వాటికి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాయి.
వాటిని తరచుగా చూస్తూ ఫాలో కావడం వల్ల ముందుగానే దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
ఇక ప్రయాణానికి బయలుదేరే ముందే జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేసుకొండి. సబ్బు, టూత్‌బ్రష్, దువ్వెన, టవల్ లాంటి వాటిని పైన, సులువుగా దొరికేలా సర్దుకోండి.
ఒకవేళ వెయిట్ చేయాల్సి వచ్చినా ఇవి తొందరగా దొరుకుతాయి. వెతుక్కునే పని లేకుండా ప్రశాంతంగా పని పూర్తి చేసుకోవచ్చు.
చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది.
కనుక ముఖ్యమైన మందులు అంటే.. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా తీసుకెళ్లండి. అందుబాటులో పెట్టుకొండి.
అలానే డయాబెటిస్ లాంటి జబ్బులుంటే మీ మందుల కిట్‌ని తీసుకెళ్లడం మర్చిపోకండి.
అసలే చలి కాలం కనుక.. స్వెట్టర్లతో పాటుగా అదనంగా ఓ బ్లాంకెట్ కూడా తీసుకెళ్లండి.