సచిన్‌ బాల్య స్నేహితుడు వినోద్‌ కాంబ్లీ  ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడంటూ  వార్తాలు వస్తున్న విషయం తెలిసిందే.

ఒక దశలో సచిన్‌ను మరిపించిన కాంబ్లీకి  అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. అసలు  అతని గతం ఏంటి?  వీటి గురించి క్షుణ్ణంగా  ఇప్పుడు తెలుసుకుందాం.

స్కూల్‌ క్రికెట్‌లో కాంబ్లీ ఒక సూపర్‌స్టార్‌.ఈ  క్రమంలోనే సచిన్‌ టెండ్కూలర్‌తో కలిసి  స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఏకంగా 664  పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచ  రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌తోనే  కాంబ్లీ-సచిన్‌ల పేర్లు క్రికెట్‌  ప్రపంచలో మారుమోగిపోయాయి. ఇక్కడి  నుంచి కాంబ్లీ-సచిన్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌  అయిపోయారు. 

ఈ క్రమంలోనే 1991లో కాంబ్లీ భారత  జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటికే  సచిన్ కూడా జాతీయ జట్టులో భాగం అయ్యి  ఉన్నాడు.

1991 అక్టోబర్‌ 18న పాకిస్థాన్‌తో షార్జాలో జరిగిన  వన్డే మ్యాచ్‌తో కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో  అరంగేట్రం చేశాడు. 

ఇక 1993లో భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో  టెస్టులోకి అడుగుపెట్టిన కాంబ్లీ.. ఆడిన తొలి  ఏడు టెస్టుల్లోనే ఏకంగా 793 పరుగులు చేసి  సత్తా చాటాడు. 

1993లో అతడి బ్యాటింగ్ యావరేజ్ 113 ప్లస్‌.  ఈ బ్యాటింగ్‌ యావరేజ్‌ అప్పట్లో సంచలనం.  సచిన్‌ అయితే ఈ బ్యాటింగ్‌ యావరేజ్‌కు ఆ  సమయంలో దరిదాపుల్లో కూడా లేడు.

ఇక అదే ఏడాది రెండు డబుల్‌ సెంచరీ(223,  227)లతో అదరగొట్టాడు. దీంతో వినోద్‌ కాంబ్లీ  ప్రపంచ క్రికెట్‌లో ఒక స్టార్‌గా మారిపోయాడు.  కెరీర్‌ను ఇలా రాకెట్‌ స్పీడ్‌తో ప్రారంభించిన  ఏకైక క్రికెటర్‌ కాంబ్లీనే.

అలాగే అతిపిన్న వయసు(21 ఏళ్ల 32  రోజులు)లో డబుల్‌ సెంచరీ కొట్టిన మూడో  ఆటగాడిగా కాంబ్లీ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో  వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న 4వ  ఆటగాడిగా కాంబ్లీ నిలిచాడు. 

కానీ.. ఒక్కసారిగా వచ్చి పడిన స్టార్‌డమ్‌తో కాంబ్లీ  ఫోకస్‌ పక్కదారి పట్టంది. ఆటపై శ్రద్ధ తగ్గించి  జల్సాలకు ఎక్కువగా అలవాటు అయ్యాడు. ఇదే  టైమ్‌లో సచిన్‌ మాత్రం ఆటపై నుంచి తన దృష్టి  మరలకుండా జాగ్రత్త పడ్డాడు.

ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ దిగ్గజంగా మారడానికి..  కాంబ్లీ ఒక మెరుపుతీగలా మెరిసి  మాయమైపోయేందుకు తేడా కేవలం  కమిట్‌మెంట్‌.

వినోద్‌ కాంబ్లీ మాత్రం తన స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌  చేస్తూ ఆటను నిర్లక్ష్యం చేశాడు. పైగా తాగుడుకు  బానిసైయ్యాడు.

ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లోకి జెడ్‌స్పీడ్‌తో  దూసుకొచ్చి కాంబ్లీ.. కెరీర్‌ ముగిసేందుకు ఎక్కువ  సమయం పట్టలేదు.

సచిన్‌ లాంటి కమిట్‌మెంట్‌తో ఆడి ఉంటే కాంబ్లీ  కూడా ఇప్పుడు ఇండియన్‌ క్రికెట్‌లో ఒక  లెజెండ్‌లా ఉండేవాడు. కానీ.. అతను చేజేతులా  చేసుకున్న పనులు, చెడు వ్యసనాలు, దురదృష్టం  కాంబ్లీ కెరీర్‌ను నాశనం చేశాయి.