మెగాస్టార్‌ చిరంజీవి, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ గత 40 ఏళ్లుగా ఎన్నో సినిమాలు కలిసి చేశారు.

చిరంజీవికి బ్లాక్‌ బాస్టర్‌ హిట్లను ఇచ్చిన ఎన్నో సినిమాల్లో కైకాల కీలక పాత్రలు పోషించారు. అయితే, కైకాల సత్యనారాయణ గత కొన్ని నెలలనుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

బెడ్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం కైకాల పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు.

బెడ్‌పై ఉన్న కైకాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. స్వయంగా కేకు కట్‌ చేయించారు.

అనంతరం ట్విటర్‌ వేదికగా చిరంజీవి స్పందిస్తూ..  ‘‘ పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది

ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

కాగా, కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి.

ఎంపీ రఘురామకృష్ణంరాజు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ దిగ్గజ సినీ నటులు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ కైకాల సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

మరి, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజును పురస్కరించుకుని మీ శుభాకాంక్షల్ని కామెం‍ట్ల రూపంలో తెలియజేయగలరు.