మోస్ట్ అవైటెడ్.. పోస్ట్ పోన్డ్ విరాటపర్వం మూవీ కథేంటి? సినిమా ఎలా ఉంది? ఎవరెలా నటించారో చూసేద్దాం.
1990ల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే విరాటపర్వం.
ఆ సమయంలో సమాజంపై నక్సలైట్ల ప్రభావం ఎలా ఉండేది? అసలు ప్రజలు పోలీసులను, ప్రభుత్వాలను కాదని అన్నలను ఎందుకు సహాయం కోరుతున్నారు?
ప్రభుత్వానికి సవాలుగా మారిన నక్సల్స్ ని కంట్రోల్ చేయడంలో పోలీసులు ఎంత మేర సక్సెస్ అయ్యారు.. అందుకు ఎలాంటి దారులు ఎంచుకున్నారు అనేదే కథ.
ఈ కథ నేపథ్యంలోనే వెన్నెల(సాయి పల్లవి)కు దళ కమాండర్ రవన్న(రానా)పై ప్రేమ పుట్టడం జరుగుతుంది. అయితే తనలో పుట్టిన ప్రేమను రానాకు తెలియజేసిందా?
అందుకు రానా ఒప్పుకున్నాడా? అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది మీరు తెర మీద చాడాల్సిందే.
విశ్లేషణ:
నక్సల్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించడం అనేది అనుకోవడానికి బాగానే ఉన్నా.. అది ఒక సాహసమనే చెప్పాలి
డైరెక్టర్ వేణు ఊడుగుల.. తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.
అప్పట్లో జరిగిన ఎన్నో అణచివేతలు, కులం, వర్గం, వర్ణం పేరుతో జరిగిన దాడులను గుర్తు చేస్తూనే.. ప్రేక్షకులకు ఒక అందమైన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు.
మనసులో ఒకటి అనుకుంటే అది చేయడానికి ఎంతకైనా తెగించే ఒక మొండి, తెలివైన, చలాకీ అమ్మాయి వెన్నెల(సాయి పల్లవి).
సమాజంలో జరుగుతున్న అణచివేతలు, పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు చూసి విసిగిపోయి అన్నల్లో కలిసిపోతాడు డాక్టర్ రవి శంకర్ అలియాస్ రవన్న(రానా).
ఇద్దరివీ భిన్నమైన లోకాలు.వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే.
సాయి పల్లవి- రానా నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. నిజానికి కొన్ని సీన్లలో సాయి పల్లవి.. రానానే డామినేట్ చేసిందనిపిస్తుంది.
రానా ఎప్పటిలాగానే తన పాత్రకు నూరు శాతం న్యాయం చేశాడు.సమాజంపై కోపం, అసంతృప్తి, ఆవేదన, వెన్నెలపై ప్రేమ, తల్లిపై అనురాగం ఇలా అన్ని ఎమోషన్స్ రానా నటనలో స్పష్టంగా కనిపిస్తాయి
విరాటపర్వం సినిమాతో వేణు ఊడుగుల మంచి డైరెక్టర్ అనే పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వేణు ఊడుగుల పెన్ పవర్, స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాతో మరింత బలంగా తెలుస్తాయి.
సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎడిటర్ గా ఎన్నో అవార్డులు అందుకున్న శ్రీకర్ ప్రసాద్ తన మార్క్ ఎడిటింగ్ తో మళ్లీ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.