రాక్షసుడికిచ్చిన మాటకోసం మద్దిచెట్టులో వెలసిన ఆంజనేయస్వామి || History of Maddi Anjneya Swamy Temple

             భక్తుడికిచ్చిన మాటని నేరవేర్చడంకోసం మద్దిచెట్టు తొర్రలో వెలసిన ఆంజనేయుడు...

          పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గురవాయిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం. ఒక  అసుర భక్తుడి కోరికను మన్నించిన ఆంజనేయుడు ఇక్కడే ఒక మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుగా వెలిసి,ఆ క్షేత్రానికొచ్చి తనని దర్శించిన భక్తుల కోరికల్ని నెరవేరుస్తూ వారిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉన్నాడు.స్వామి ఈ క్షేత్రంలో తెల్లమద్దిచెట్టు తొర్రలో స్వయంభువుగా కొలువైయుండడానికి  ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది.అదేమిటంటే,  సీతాన్వేషణలో భాగంగా  లంకకు చేరుకున్న  ఆంజనేయుడు చూపిన పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు  ప్రత్యక్షంగా చూసి,ఆంజనేయ స్వామికి భక్తుడిగా మారిపోతాడు.అతను అను నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు.

         అతను  శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా వెళ్లి కలిసే  భాగ్యం  లేకపోయింది. వచ్చే జన్మలోనైనాసరే  హనుమంతుడి సాక్షాత్కారం పొందాలన్న కోరికతో  హనుమ సేనకు ఎదురెళ్లి, మధ్యుడు వీరమరణం పొందాడని మన రామాయణం ద్వారా తెలుస్తోంది.అలా వీరమరణం పొందిన మధ్యుడు, గురవాయిగూడెంలో ఇప్పుడున్న  మద్ధి క్షేత్రంలో మద్ది వృక్షంగా ఈ కలియుగంలో  జన్మించాడనీ భక్తుడైన అతడిని అనుగ్రహించేందుకే ఆ మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని స్థలపురాణంబట్టి తెలుస్తోంది.అలా అవతరించిన తర్వాత  ఆంజనేయుడు స్థానికంగా ఉన్న  ఒక భక్తురాలికి  స్వప్నంలో కనిపించి, గురవాయిగూడెంలో మద్దిచెట్టు తొర్రలో తాను స్వయంభువుగా వెలిశాననీ, అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో ఆ భక్తురాలు ఆ చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందట.  క్రీ.శ.1166వ సంవత్సరంలో ఆ గురవాయిగూడెంలోవారికి స్వామివారి  మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. గతంలో తొలుత ఆ చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు.

          తర్వాత 1978వ సంవత్సరంలో అక్కడ  పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ తెల్ల మద్ధి చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేసి,అక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. భక్తులు ఆ ఆలయానికి వచ్చి,ఆలయ ప్రధాన మండపం చుట్టూ ముందుగా  21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. దీనితోపాటు శని దోషాలూ, రాహు కేతు దోషాలూ, నవగ్రహ దోషాలూ ఉన్నవారు కూడా స్వామిని దర్శించుకుంటే ఆ దోషాలన్నీ  తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ప్రతి శనివారం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా జరుపుతారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామి కల్యాణాన్ని  వైభవంగా నిర్వహిస్తారు. 

Comments