కిమ్ ఈరోజు అమెరికానుబయపెట్టాడు కానిమనవాజ్‌పేయి ఏనాడో చెమటలుపట్టించాడు | Atal Is Sweating To America

         అగ్రరాజ్యాలను ఢీకొట్టి.. అణు పరీక్షలు నిర్వహించి.. పోఖ్రాన్‌-2 నిర్వహణలో గుండెధైర్యంతో నిలిచిన వాజ్‌పేయీ

      భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ ఎయి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందప్పుడు. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, చైనా వరుసగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. చైనా అండతో దాయాదిదేశం పాకిస్థాన్‌ సైతం అణ్వాయుధాలను తయారు చేసుకోవడంలో మన కన్నా ఒక అడుగు ముందే ఉంది. 1974లో స్మైలింగ్‌ బుద్ధపేరుతో భారత్‌ తొలి అణు పరీక్ష జరిపి అప్పటికే చాన్నాళ్లైంది. ఇందిరా గాంధీ మరణం, రాజీవ్‌ గాంధీ మరణంతో, అస్థిర ప్రభుత్వాల కారణంగా సొంతంగా అణుబాంబులు రూపొందించుకోవడంలో మన దేశం అప్పటికే వెనకబడింది.సాంకేతిక పెరగడంతో భారత్‌ అణు పరీక్ష కేంద్రాలపై అమెరికా అంతరిక్షంలో ఉపగ్రహాలతో పటిష్ఠ నిఘా వేసింది. థార్‌ ఎడారిలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకుంటోంది. ఆంక్షల పేరుతో దిల్లీ వర్గాలను బెదిరిస్తోంది. అమెరికా మిత్రదేశాలదీ అదే తీరు. భారత్‌కు అణు సాంకేతికత, రేడియో ధార్మిక పదార్థాలు అందకుండా ఎక్కడికక్కడ కట్టుబాట్లు. 1974లో స్మైలింగ్‌ బుద్ధ పేరుతో పరీక్షించిన అణు బాంబుల నిర్మాణ కార్యక్రమం ఆ తర్వాత ముందుకు పడలేదు. 1995లో పీవీ నరసింహా రావు రెండో దశ పరీక్షలు చేపట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ థార్‌ ఎడారిలో కదలికలను ఉపగ్రహంతో పసిగట్టిన అమెరికా తన కుట్రబుద్ధిని చాటుకుంది. అప్పటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ భారత్‌పై తీవ్ర ఒత్తిడి తేవడంతో పోఖ్రాన్‌-2పై నీలినీడలు కమ్ముకున్నాయి. అలాంటి అసాధారణ పరిస్థితుల్లో తెరపైకి వచ్చి అణు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు

          అటల్‌ బిహారీ వాజ్‌పేయి.1998 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అటుపక్క పాకిస్థాన్‌లో బేనజీర్‌ భుట్టోను ఓడించి నవాజ్‌ షరీప్‌ ప్రధాని అయ్యారు. ఈ ఎన్నికల ప్రచారంలో వాజ్‌పేయి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌ అధీనంలోకి తీసుకొస్తాంఅని ప్రకటించారు. అంతకన్నా ముందు భాజపా మదిలో ఉన్న లక్ష్యం మాత్రం భారత్‌ అణుశక్తి సామర్థ్యం గల దేశంగా ఆవిర్భవించడం. 1998 మార్చి 18న వాజ్‌పేయి బహిరంగంగానే అణువిస్ఫోటం గురించి లాబీయింగ్‌ మొదలుపెట్టారు. దేశ భద్రత విషయంలో రాజీపడే సమస్యే లేదు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అణుబాంబులు సహా అన్ని అవకాశాలను వినియోగిస్తాంఅని బహిరంగ ప్రకటన చేశారు.క్షిపణి పితామహుడుఅబ్దుల్‌ కలాం, భౌతికశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం, ఇతర అధికారులతో ప్రధాని వాజ్‌పేయి మంతనాలు సాగించారు. కలాం క్షిపణుల వ్యవస్థ, చిదంబరం అణు కార్యక్రమం యథాతథ పరిస్థితిని వివరించారు. 1998, మార్చి 28న వాజ్‌పేయి సాధ్యమైనంత త్వరగా అణు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంకావాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. అప్పటికే పాక్‌లోని అణ్వాయుధ పరీక్ష ప్రయోగశాలలు పర్వత సానువుల దిగువన ఉండటంతో ఉపగ్రహాల నిఘాకు చిక్కకుండా అణ్వాయుధాలకు అవసరమైన సాంకేతికతను సంపాదించింది. అదే సమయంలో భారత్‌పై అమెరికా నిఘా ఎప్పటిలాగే ఉంది.అమెరికా నిఘా ఉపగ్రహాలకు చిక్కకుండా భారత శాస్త్రవేత్తలు, సైనిక అధికారులు వేర్వేరుగా, చిన్న చిన్న బృందాలుగా చాలా రహస్యంగా పరీక్ష ప్రాంతాలను సిద్ధం చేయసాగారు.

           మనదేశంలో అధికారులకూ, రాజకీయ నాయకులకూ ఈ విషయం తెలియదు. శాస్త్రవేత్తలు సైతం పరీక్ష ప్రాంతంలో నిఘాకు చిక్కకూడదని సైనిక దుస్తులు ధరించారు. రాత్రి వేళలో పనిచేశారు. ఏవైనా వస్తువులు కదిలిస్తే మళ్లీ ఉదయంలోపే యధావిధిగా ఉంచేవారు. అక్కడ ఏం జరగలేదని చెప్పేందుకు అన్నమాట. బాంబుషాప్ట్‌లను మట్టి దిబ్బల్లా రూపొందించారు. సెన్సర్లను, కేబుళ్లను మట్టితో కప్పేవారు. పరీక్ష ప్రాంతానికి వెళ్లేటప్పుడు గ్రామాల్లో ఒకలాగా, సైనిక కేంద్రాల వద్ద ఒకలాగా వస్త్రధారణ మార్చి వెళ్లేవారు. ప్రయోగ ప్రాంతంలో మాత్రం సైనిక దుస్తులు వేసుకునేవారు. తమ వ్యూహానికి భారత్‌ పెట్టుకున్న పేరు ఆపరేషన్‌ శక్తి’ వాజ్‌పేయి ఇచ్చిన అండతో, సహాయ సహకారాలతో శాస్త్రవేత్తలు శక్తి-1, శక్తి-2, శక్తి-3, శక్తి-4, శక్తి-5 అణుబాంబులను రూపొందించారు. 1998, మే 13న ఉదయం 3.34 గంటలకు వరుసగా మూడు అణుబాంబులను పరీక్షించారు. తర్వాత మిగతా రెండు బాంబులను ప్రయోగించారు. 1998, మే 13న అణుబాంబు పరీక్షలు విజయవంతం అయ్యాయని భారత్‌ సగర్వంగా ప్రకటించింది. దిల్లీ నుంచి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 15:45 గంటలకు పోఖ్రాన్ పరిధిలో మూడు అణుబాంబులను భారత్‌ పరీక్షించింది. అంచనా వేసిన స్థాయిలోనే శక్తి వెలువడింది. వాతావరణంలో ఎలాంటి రేడియేషన్‌ విడుదల అవ్వలేదు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు అభినందనలుఅని అన్నారు. పరీక్షల తర్వాత అమెరికా, కెనడా, జపాన్‌ తదితర దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినా వాజ్‌పేయి రాజనీతి, చాణక్యంతో అన్నీ ఐదేళ్లలో తొలగిపోయాయి. ఆ తర్వాత ఇంకెప్పుడూ భారత్‌ వెనుదిరగలేదు. ఆయుధ సంపత్తిలో అగ్రదేశాల సరసన నిలిచింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎదురొడ్డి నిలిచిన వాజ్‌పేయీ భారత అణు భాగ్య విధాతగా పేరుపొందారు.

Comments