గుడిలో భక్తులకి కనిపించిన ఐదు పడగల నాగ పాము || 5 Headed Snake Near at Nagaraja Temple

   ఆ దేవాలయంలో  ఐదు తలల  పాము ప్రత్యక్షమై  భక్తుల్ని దీవిస్తుందట... 

         తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రముగా విలసిల్లే  కన్యాకుమారికి  21 కిలోమీటర్ల దూరంలో  నాగర్ కోయిల్ అనే పట్టణం ఉంది. ఈ పట్టణంలో అత్యంత ప్రాచీనమైన నాగరాజ దేవాలయం ఒకటి ఉంది.  ఈ దేవాలయం నిర్మాణం ఎప్పుడు జరిగిందనడానికి సరైన ఆధారాలు లేవుకానీ, గతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చేర, చోళ, పాండ్య రాజ్య వంశాలకి చెందిన వారందరూ ఈ దేవాలయం అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్టుగా చెబుతారు.   ఈ దేవాలయం ఎన్నో  అద్భుతాలకు నిలయంగా చెబుతారు. ఈ ఆలయంలో ప్రధాన దైవాలుగా శ్రీ కృష్ణుడు మరియు నాగరాజులు కొలువైయుంటారు.ఇక్కడి   శ్రీ కృష్ణుడిని ఆనందకృష్ణుడి పేరుతో కొలుస్తారు.   ఇక ఇక్కడుండే నాగరాజును సర్పరాజు అయిన వాసుకిగా భావిస్తారు. వీరిద్దరే కాకుండా ఈ దేవాలయంలో శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడుకి చెందిన      ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ నాగరాజ గుడి ముందు భాగంలో పెద్ద కోనేరు ఉంది. ఇందులో భక్తులు స్నానాలు చేసి నాగరాజును దర్శించుకొంటారు. కోనేరు పక్కనే పెద్ద అశ్వర్థకట్ట ఉంది.  ఈ కట్ట పై ఎక్కువ సంఖ్యలో నాగరాజ ప్రతిమలు ఉంటాయి. కేవలం ఈ అశ్వర్థ కట్ట పైనే కాకుండా ఆలయం మొత్తం మీద ఎన్నో నాగరాజు ప్రతిమలు ఉండడం విశేషం..  భక్తులు ఈ దేవాలయంలో  నాగరాజ ప్రతిమను ప్రతిష్టచేసి, ఆలయంలో ఉన్న  చెట్టుకు ఊయలని  ముడుపుగా చెల్లిస్తే సంతానం లేనివారికి తప్పకుండా సంతానం కలుగుతుందని  భక్తుల నమ్మకం.

        ఈ నాగరాజుగుడి   గర్భాలయంలో నీరు ఊటగా ఊరుతూ ఉంటాయి ఆ ఊటనీటినే  భక్తులకు తీర్థంగా ఇవ్వడం ఇక్కడి మరో  ప్రత్యేకత. ఈ ఊటనీరు అక్కడి ఇసుకనుంచి ఊరుతూ ఉంటాయి.ఈ  ఇసుక ఏడాదిలో ఆరు నెలలు తెల్లగానూ  మిగిలిన ఆరు నెలలు  నల్లగానూ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ దేవాలయం నిర్మాణం వెనుక ఒక  కథప్రచారంలో ఉంది. అదేమిటంటే, గతంలో ఒకరోజు   ప్రస్తుతం దేవాలయం ఉన్న చోట ఒక బాలిక  గడ్డి కోస్తుండగా ఆ కొడవలి పదునికి ఏదో తగిలి దానికి  రక్తం అంటుకుంటుంది.  ఆ బాలిక  ఆశ్చర్యంతో అక్కడ చూడగా ఆ ప్రదేశంలో ఐదు పడగల పాము విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం చూసిన ఆ బాలిక భయంతో పరుగెత్తుకుంటూ దగ్గర్లోని ఊరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం ఆ గ్రామస్తులకి చెబుతుంది. దాంతో గ్రామస్తులు కొందరు అక్కడికి వచ్చి చూడగా వారికి నిజమైన ఐదు పడగల పాము   కనిపిస్తుంది.  దాంతో ఆ గ్రామస్తులందరూ ఆ పాముకి మ్రొక్కగా అది మాయమైపోతుంది.

      అ గ్రామస్తులు అక్కడ చిన్న గుడి కట్టి  నాగ రాజుని  పూజించడం మొదలుపెడతారు.  ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు కుష్టువ్యాధితో బాధపడుతున్న ఒక  రాజు ఈ గుడికి వచ్చి,   తన బాధను చెప్పుకోగా విచిత్రంగా అతని వ్యాధి మాయం అవుతుంది..    రాజు నాగరాజుకు పరమ భక్తుడిగా మారిపోయి,ఆ ప్రాంతంలో  ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించాడని కొందరు చెబుతారు. అంతేకాదు ఇప్పటికీ అక్కడి గుడి ప్రాంగణంలో  ఐదు తలల నాగ సర్పం సంచరిస్తూ ఉండడాన్ని ఎందరో భక్తులు స్వయంగా చూశారు.ఆ సర్పం ఎవ్వరినీ ఏమీ చెయ్యకుండా దూరంగా వెళ్లి,తన ఐదుపడగల్నీ ఎత్తి భక్తుల్ని ఆశీర్వదించి మాయమై పోవడం  ప్రత్యక్షంగా చూసిన కొందరు భక్తులు చెప్పడం విశేషం... ఇన్ని విశిష్టతలు కలిగిన నాగర్ కోయిల్ నాగరాజ స్వామి దేవాలాయన్ని నాగపంచమి రోజునే కాకుండా మిగతా రోజుల్లో కూడా అనేకమంది భక్తులు సందర్శించి  తమకోరుకలు కోరుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.కాబట్తి మీరు కూడా వెళ్లి ఆలయాన్ని తప్పక దర్శించండి.     

   

Comments