పాము రూపంలో భక్తుల కంటపడిన అమ్మవారు..!

      సెలయేటిలోని  కొండల్లో వెలసిన గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి... 

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకి దగ్గరలో ఉన్న  బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అడవి ఉంటుంది.ఆ  అడవిలోఉన్న సెలయేటి   కొండలమధ్య వెలసిన అమ్మవారే గుబ్బల మంగమ్మ తల్లి. 50యేళ్ల క్రితమే  ఆ తల్లి, ఆ అడవిలో  వెలసినప్పటికీ దాదాపు నలభై యేళ్ళ నుంచీ   అడవిజాతివారు ఆమెని  అడవి తల్లిగా పూజిస్తూ వస్తున్నారు.  ఆ ప్రాంతంలోని అడవిలో నివశించే  కొండజాతికి చెందిన ప్రజలు గుబ్బల మంగమ్మ తల్లిని 'అడవితల్లి' గా ఆరాధిస్తూ ఉంటారు. ఆమె కొలువైయున్న గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ అంతుబట్టని మిస్టరీగా మిగిలి ఉంది.ఆ తల్లిని దగ్గరి నుంచి చూస్తే ఆమె  సర్పజాతి  లక్షణాలను కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా ఆ ప్రాంతంలో  అమ్మవారు    ఒక సర్పం రూపంలో రహస్యంగా  తిరుగుతూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. 

       ఆ ప్రాంతంలో గుబ్బల  మంగమ్మ అమ్మవారు కొలువైయున్నట్టుగా ముందుగా గుర్తించింది కరాట కృష్ణమూర్తి అనే వ్యక్తి అని చెబుతుంటారు.అందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే,  నేటికి యాభై ఏళ్ల క్రితం బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే భూస్వామి ఒకరోజు మంగమ్మతల్లి కొలువై ఉన్న ప్రాంతంలో అంటే అడవిలో   వెదురు గెడలు సేకరించుకొని ఎడ్ల బండిపై తీసుకెళ్తుండగా,  ఎడ్లు అక్కడినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయాయట. దాంతో  ఏం చేయాలో తెలియక  కృష్ణమూర్తి ఎడ్లబండినుంచి  వెదురును దించివేసి ఎడ్లబండినితోలుకొని  ఇంటికి వచ్చేసారట.  ఆ రాత్రి నిద్రించిన  కృష్ణమూర్తికి గుబ్బల మంగమ్మతల్లి కలలో కనిపించి ‘‘నీ బండి ఆగిన ప్రాంతంలోనే ,వాగు వెంబడి కొంతదూరం ప్రయాణించగానే  కొండనుంచి పారే జలపాతం కనిపిస్తుంది.ఆ  ప్రదేశంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలోనే నేను వెలిశాను..నువ్వు వచ్చి నన్ను దర్శించుకుని వెళ్ళు .. అక్కడికి వెళ్లి నన్ను దర్సించుకున్న తర్వాత నేనువెలసిన ప్రాంతంలో  నాపేరుమీద కొంతమందికి  అన్నదానం చెయ్యి...."అని చెప్పి, ఆ తల్లి అంతర్థానమయ్యింది...  కృష్ణమూర్తి నిద్రనుంచి మేల్కొని ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి,చూడగా గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రదేశం కనిపించిందట.

      మంగమ్మను దర్శించుకున్న కృష్ణమూర్తి అమ్మవారికి పూజలు చేసి, ఏజన్సీ ప్రాంతంలోని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు అన్నసంతర్పణని ఏర్పాటు  చేయించారట.  ఆ సంతర్పణకు వచ్చిన ఆ  భక్తులు గుబ్బల మంగమ్మ అమ్మవారిని  దర్శించుకోగా ఆశ్చర్యంగా వారి కోర్కెలు నెరవేరాయట. దాంతో  మంగమ్మతల్లిని మహిమ కలిగిన దేవతగా భావించి, ఆ ప్రాంతపు ప్రజలందరూ ఆమెని భక్తితో కొలవడం ఆరంభించారు. ఆమె మహిమలు చుట్తుపక్కల ప్రాంతాలకు కూడా పాకడంతో ఆమెని దర్శించుకుని పూజించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రాంతంలో ఒక  గానుగ చెట్టు ఉంది. అది చాలామహిమ గలిగిన చెట్టు.ఈ చెట్తుకి పూజలుచేస్తే సంతానంలేనివారికి సంతానం కలుగుతుందని చెబుతారు.అందుకే ఆ  చెట్టు సంతాన వృక్షంగా పేరు పొదింది.  పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న తర్వాత  పసుపు కుంకుమలు ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలా చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో వారి కడుపు పండి, వారికి సంతానప్రాప్తి లభిస్తుందని అక్కడి భక్తుల  విశ్వాసం. ఈ గుబ్బలమంగమ్మ  క్షేత్రానికి ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో వేలాదిగా భక్తులు తరలివస్తారు.వారిలో కొందరు ఈ చెట్టుకి సంతాన పూజలు జరుపుతుంటారు..

 

Comments