మార్కోనీ రేడియో ఎలా కనిపెట్టాడో తెలుసా..? || Wireless Radio Inventor Guglielmo Marconi Biography

           రేడియో ఆవిష్కర్త మార్కోనీ  సక్సెస్ స్టోరీ

        పూర్వకాలంలో మనిషి కనిపించకుండా మాటలు మాత్రమే వినిపిస్తే దాన్ని అశరీరవాణిగాపిలిచాం....ఆకాశం నుంచి వినిపించే మాటల్ని మేఘవాణి అన్నాం... ఇప్పటిదాకా మనం ఈ అశరీరవాణి,మేఘవాణుల గురించే   విన్నాం...ఇదంతా దేవతలు చెప్పే  మాటలుగా దైవాన్ని నమ్మేవారు పురాణకాలమునుంచీ విశ్వసిస్తూ వచ్చారు.కానీ నేటికాలంలో అలా మనిషి కనిపించకుండా మాటలు మాత్రమే వినిపిస్తే అది అద్భుతమే కదా...ఆ అద్భుతం పేరే రేడియో.ఆ అద్భుతాన్ని మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన శాస్త్రవేత్త మార్కోనీ.  సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపే రేడియో వ్యవస్థకి  ఆద్యుడుగానూ,  రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగానూ ప్రసిద్ధి చెందిన మార్కోని 1874 ఏప్రిల్ 25 న ఇటలీలోని  బొలొగ్నాలో జన్మించాడు. అన్నీ జేమ్‍సన్ మరియు గుసెప్ మార్కోనీలు ఆయన తల్లిదండ్రులు.

     మార్కోని బొలోగ్నాలో ఉన్న  అగస్టో రిఘి లాబొరేటరీలో ప్రైవేటుగా చదువుకొన్నాడు. విద్యార్థి దశలో మార్కోనీ పరిశోధనల పట్ల ఆసక్తిని కనబరిచేవాడు.  మార్కోని చాలా  తెలివైనవాడు కావడంతో  అతని జీవితం బాల్యం నుండి పరిశోధనలవైపుకి మళ్లింది.   ఆ పరిశోధనల్లో  కూడా శాస్త్రీయ మరియు విద్యుత్ పరికరాలకి సంబంధించిన పరిశోధనల పట్లే అతను  ఎక్కువ మక్కువ చూపేవాడు. మార్కోనీ  కాలంలో హెన్రిచ్ హెర్ట్జ్   అనే ఒక శాస్త్రవేత్త విద్యుదయస్కాంత కిరణాలపై పరిశోధనలు చేసి , ప్రస్తుతం యిప్పుడున్న రేడియో తరంగాల్ని కనుగొన్నాడు. అప్పట్లో ఈ తరంగాలని  హెర్టిజియన్ తరంగాలుగా  పిలిచేవారు. 1894 లో హెర్ట్జ్ మరణానంతరము, ఆయన పరిశోధనలను  మార్కోనీ కొనసాగించి కొత్త ఆవిష్కరణలని  సృష్టించి లోకానికి అందించాడు.  ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ,  బొలోగ్నా విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్రవేత్త అయిన ఆగస్టో రిఘి సహాయం తీసుకున్నాడు.  దానికంటే ముందు  మార్కోని ఇటలీలోని ఫ్రిఫోన్ ప్రదేశంలో ఉన్న  తన ఇంటిలో తన స్వంత ఉపకరణములు ఉపయోగించి, అతని పనివాడు అయిన మిజ్ఞానితో కలసి ఈ ప్రయోగాలకి శ్రీకారం చుట్టాడు.

       ఆ సమయంలో ఈయన  వైర్‍లెస్ టెలిగ్రాఫీ వ్యవస్థలో  రేడియో తరంగాలను ఉత్పత్తిచేసి సమాచారాన్ని పంపాలనే లక్ష్యంతో పనిచేశాడు. నిజానికి  ఇది కొత్త ఆలోచన కాదు. అనేకమంది పరిశోధకులు వైర్‍లెస్ టెలిగ్రాఫ్ గూర్చి మార్కోనీ కంటే ముందు 50 సంవత్సరములనుండి పరిశోధనలు చేస్తూ వచ్చారు. కానీ ఏ ఒక్కరూ సాంకేతికంగా విజయాన్ని సాధించలేకపోయారు. కానీ ఆ శాస్త్రవేత్తల థియరీలని ఆధారంగా చేసుకొని,మార్కోనీ రేడియోని కనిపెట్టి,సక్సెస్ ని సాధించి  అందరినీ ఆశ్చర్యపరిచాడు.  ఒకరోజు అర్థరాత్రి సమయంలో తల్లిని నిద్రలేపి ఓ తమాషా చూపిస్తానని తమ యింటిపై ఉండే తన ప్రయోగశాలకి  తీసుకెళ్ళాడు. గదిలో ఒకచోట మోర్స్ కీ  ఉంచి,  12 అడుగుల దూరంలో ఒక ఎలక్ట్రిక్ బెల్ ని అమర్చాడు.ఆ కీ ని అదిమినప్పుడల్లా అక్కడి గంట మోగడం ప్రారంభించింది. మధ్యలో తీగలు లేకపోయినా గంట మోగటం చూసిన తల్లి ఆశ్చర్యానికి గురి అయ్యింది.  ఎప్పటికైనా తన కొడుకు ప్రపంచం గర్వించే స్థాయికి ఎదుగుతాడని ఆ తల్లి ఆనాడే ఊహించింది.ఆమె  ఊహ నిజమవ్వడానికి ఎన్నో రోజులు పట్టలేదు. మార్కోనీ తన పరికరాల్ని ఇంటి ముందుండే తోటలోకి మార్చి, సంకేతాలు వెళ్ళగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. అతని ప్రయత్నంవల్ల ఆ సంకేతాలు ఓ చిన్న గుట్ట ఆవలిపైపు దాకా  వెళ్ళగలిగాయి.  

       1896 నాటికి ఈ సంకేతాలని రెండు మైళ్ళ దాకా వెళ్ళగలిగేలా చేశాడు.. చివరికి కొన్ని వందలమైళ్ళ  దూరం వెళ్లగలిగేలా రేడియోని రూపొందించి ప్రపంపంచం దృష్టిని  తనవైపుకి తిప్పుకున్న మేథావి మార్కోనీ.  ఇటలీలో అతను కనిపెట్తిన ఆ  పరికరానికి పేటెంట్ హక్కులు యివ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇంగ్లాండు వెళ్లిపోయాడు.1897లో   మార్కోనీ కనిపెట్టిన ఆ రేడియో నాటి కాలంలో దూరశ్రవణ పరికరంగా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకొంది. తర్వాతి కాలంలో ఆ రేడియో ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచంలో ఏ మూలనుంచి ఏమూలకైనా రేడియో స్టేషన్ల  ద్వారా అనేక విశేషాల్ని ప్రజలకి అందించగలిగేలా అభివృద్ధి చెందింది.   మార్కోనీ కనిపెట్తిన ఆ రేడియో ఎందరో శాస్త్రవేత్తలకి ఆదర్శంగా నిలిచి,తర్వాతి కాలంలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకి  బాటలువేసింది. ఇప్పుడు ఆ రేడియోలుకాస్తా ఎఫ్ ఎం.లు గామారిపోయాయి.ఈ ఎఫ్.ఎం లకి మూలకారణమైన రేడియోని కనిపెట్టి ప్రపంచానికి అందించి, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న  మార్కోనీని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాల్సిందే.   

  

Comments