థామస్ ఆల్వా ఎడిసన్ సక్సెస్ స్టోరీ....! Thomas Alva Edison Biography || Edison's Inventions and Unknown Life History

            థామస్ ఆల్వా ఎడిసన్ సక్సెస్ స్టోరీ....

        చదువు జ్ఞానాన్ని పెంచుతుందని చెబుతుంటారు...కానీ ప్రతిభకీ  జ్ఞానానికీ చదువుతో పెద్దగా సంబంధంలేదని నిరూపించిన వ్యక్తి... అద్భుత శక్తీ, థామస్ ఆల్వా ఎడిసన్. ఒకప్పుడు న్యూస్ పేపర్లు అమ్ముకొని జీవించిన ఆ వ్యక్తి...గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చరపరిచేలా సరికొత్త వస్తువులెన్నింటినో కనుగొనే స్థాయికి ఎదిగాడు. నిరంతర పరిశోధనలే శ్వాసగా....సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా... పరిశోధనా రంగంలోకి అడుగిడి...ఎన్నో సరికొత్త ఆవిష్కరణల్ని  చేపట్టి ప్రపంచాన్ని నివ్వెరపరచిన    అపరమేథావి...థామస్ ఆల్వా ఎడిసన్.    థామస్ అల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847  శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్   మరియు  నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ అనేదంపతులకు ఏడవసంతానంగా అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన   మిలన్ అనే ప్రాంతంలో జన్మించి, మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు.   అతనికి స్కూలుకెళ్లే వయసువచ్చి తల్లిదండ్రులు స్కూలులో జాయిన్ చేసినా,అతనికి స్కూలుకెళ్లడం పెద్దగా యిష్టం లేకపోవడంతో అతను స్కూలుకి తరచుగా ఆబ్సెంట్ అవుతుండేవాడు. స్కూలుకి వెళ్లనంటూ మారాం చేసేవాడు.

     దాంతో అతని తల్లి అయిన నాన్సీయే అతనికి గురువై విద్యా బుద్ధులు నేర్పించి అతన్ని ప్రయోజకుడిగా మార్చింది.చిన్ననాటి నుండీ పరిశోధనలపై ఎక్కువ ఆసక్తిని కనబరిచే  ఎడిసన్,తల్లి ఒడినే పాఠశాలగా మార్చుకొని,   పెరిగి పెద్ద అయ్యి, సొంతంగా లాబొరేటరీని యేర్పాటుచేసుకొనే స్థాయికి చేరుకున్నాడు.  పరిశోధనలు కొనసాగించుకోవడం కోసం మరియు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఎడిసన్,ఆ వయసులోనే  రైళ్ళలో న్యూస్ పేపర్లు మరియు స్వీట్లు అమ్మేవాడు.  అతి చిన్నవయస్సు లోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేసి,రికార్డు సృష్టించిన ఎడిసన్, 1861 లో సివిల్ వార్ సమయంలో    "గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్" అనే చిన్న న్యూస్ పేపర్ కార్యాలయాన్ని నడిపాడు. 1862 లో ఎడిసన్ ఒక స్టేషను మాష్టర్ బిడ్డను ప్రమాదం నుంచి కాపాడాడు.  అందుకు ప్రతిఫలంగా    స్టేషన్ మాస్టర్ ఎడిసన్ కి  టెలీగ్రఫీని నేర్పాడు. తర్వాత ఎడిసన్,ఆ స్టేషన్ మాస్టర్ ని అడిగి ఒక పాడైపోయిన రైల్వే బోగీని తీసుకొని దానిని  ఒక లాబొరేటరీగా మార్చుకున్నాడు.  తర్వాత అతను, ఆ రైల్వే బోగీలో    కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. ఆ సమయంలో  పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో ఆయనకు ప్రమాదవశాత్తు చెవుడు వచ్చింది. ఆ ప్రమాదం సంభవించడంవల్ల రైల్వే అధికారులు ఆయనను ఆ రైల్వే బోగీ దగ్గరికి రాకుండా   దూరం పెట్టారు.     1868 లోఒక చోటు నుంచి ఇంకో చోటుకి టెలీగ్రఫీ చేసే ఒక పరికరాన్ని కనిపెట్టి,  టెలిగ్రాఫ్ పై పేటెంట్ హక్కును పొందగలిగాడు.

       ఆ సమయంలో కుటుంబపోషణకోసం మరియు  బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్సేంజీలోనూ మరియు  టెలిగ్రాఫ్ ఏజన్సీలోనూ కొన్నాళ్ళు  పని చేశాడు. ఎన్ని ఉద్యోగాలు చేసినా కుటుంబపోషణ కష్టంగా మారడంతో ఎడిసన్,చివరికి తాను కనిపెట్తిన తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు.దానికి  ఏ కొద్ది మొత్తంలోనో  డబ్బు వస్తుందని అతను అనుకున్నాడు.కానీ   ఎడిసన్ అమ్మిన ఆ టెలిగ్రాఫ్ పరికరానికి ఆ రోజుల్లోనే  నలబై వేల డాలర్లు ముట్టడంతో  ఆశ్చర్యపోయాడు.  అంతే, ఇక అక్కడినుంచి ఎడిసన్ వెనుదిరిగి చూసుకొనే అవకాశం లేకుండా ముందుకు దూసుకుపోతూ  కొత్త కొత్త  ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. చేతిలో తగినంత డబ్బు ఉండడంతో అతని ఆవిష్కరణలకి అంతం లేకుండా పోయింది. ఆ క్రమంలోనే ఎడిసన్ 1878 లో ఎలక్ట్రిక్ బల్బ్ ను కనిపెట్టి ప్రపంచానికి అందించాడు. అప్పటి దాకా గుడ్డిదీపాలతోనూ,కొవ్వొత్తులతోనూ కాలం వెళ్లబుచ్చిన లోకం ఎడిసన్ పుణ్యమా అని ఒక్కసారిగా  వెలుగుని చూడగలిగింది. దాంతో థామస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.అంతేకాదు  అది ఎడిసన్ ని  ఆర్థికంగా  మరింత ఎత్తుకు చేర్చింది.

       ఇక అక్కడ్నుంచి వెనుదిరిగిచూసుకోకుండా,అదే సంవత్సరంలో థర్మో అయానిక్ ఎమిషన్ తో  మొదలుపెట్టి,  1887-1889 మధ్య కాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమేరాతోపాటు మానవాళికి ఉపయోగపడే ఎన్నో  కొత్త కొత్త పరికరాల్ని ఆయన రూపొందిచారు.  చనిపోయే చివరి క్షణం వరకూ సరికొత్త ఆవిష్కరణల కోసం అనుక్షణం ఆరాట పడిన థామస్ ఆల్వా ఎడిసన్  1931 అక్టోబరు 18 న  తనువుచాలించారు. మెన్లో పార్క్ మాంత్రిడుగా పేరుపొందిన ఎడిసన్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. .ఆయనని  ఆదర్శంగా తీసుకుంటే సామాన్యులు సైతం అసామాన్యులుగా మారతారనేది అక్షర సత్యం.."మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు..”  అని ప్రతి ఒక్కరిచేతా అనిపించుకొన్న మహామేథావి థామస్ ఆల్వాఎడిసన్. “ కృషి ఉంటే మనుషులు రుషులువుతారు..” అనే మాటకి నిలువెత్తు నిదర్శంగా నిలిచే థామస్ ఆల్వాఎడిసన్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలి...హ్యాట్సాఫ్ ఎడిసన్ ..మీరు మా అందరికీ మార్గదర్శి..మీ జీవితం భావితరాలవారికి స్పూర్తి. మీ ఆత్మకి శాంతికలగాలని మేమంతా ఆ భగవంతుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...   

Comments