కలరా వ్యాధిని పిండితో దూరం చేసిన బాబా | Saibaba Removed Cholera by Grinding Wheat | Saibaba Stories

          తిరగలి చక్రం తిప్పి గోధుమల్ని చల్లించి కలరాను దూరంగా తరిమికొట్టిన షిర్డీ సాయి....

            షిర్డీ సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఒకరోజు,  తన ముందు తిరగలి పెట్టుకుని గోధుమలు విసురుతున్నారు. పక్కనే వున్న గోధుమలను తిరగలిలో పోస్తూ ఆ గోధుమలని పిండిగా మారుస్తున్నారు. అక్కడికొచ్చిన భక్తులకి ఆయన అలా ఎందుకు గోధుమలు విసురుతున్నాడో  అర్థంకాలేదు.నిజానికి  షిర్డీ సాయి బిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ వుంటారు. మరి బిక్షాటన చేసే బాబా తిరగలిలో ఎందుకు పిండి విసురుతున్నాడోనని అనుకొంటూ ఉన్నారు.కానీ  ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి,ఆ భక్తులందరూ బాబాని గమనిస్తూ వుండిపోయారు. ఇంతలో అక్కడికొచ్చిన భక్తుల్లోని ఇద్దరు మహిళలు చొరవగా బాబా దగ్గరకి వచ్చారు. బాబాని కొద్దిగా పక్కకి జరగమని చెప్పి,ఆ మహిళలు   అక్కడ వున్న గోధుమలను తీసుకుని తిరగలిలో వేస్తూ కాసేపు తిరగలి తిప్పి,అక్కడ  ఉన్న గోధుమలన్నిటినీ పిండిగా మార్చారు.వారు చేసేపనికి బాబానవ్వుతూ చూస్తుండిపోయారు.

       గోధుమలన్నీ పిండి అయిపోయిన తర్వాత ఆ మహిళలు,   బిక్షాటన చేసుకునే బాబా  ఈ పిండిని ఏం చేసుకుంటారు.. ఇదంతా మనకోసమే అయి ఉంటుంది అనుకొని,ఆ పిండిని రెండుబాగాలుచేసుకొని తమ చెంగులో కట్తుకోవడానికి ప్రయత్నిస్తారు.  అప్పటిదాకా మౌనంగా ఆ మహిళలు చేస్తున్న పనిని చూస్తూ ఉండిపోయిన బాబా,అకస్మాత్తుగా వారిపై కోపగించుకొని ‘‘ఈ పిండి మన పొట్టలు నింపడానికి కాదు... ఈ పిండిని తీసుకెళ్ళి ఊరవతల పారబోసి రండి’’ అని గద్ధించారు. బాబా ఆగ్రహానికి గురి అయిన ఆమహిళలు తాము పొరపాటు చేశామని అర్థం చేసుకొని,సిగ్గుతో తలవంచుకొని,ఆ గోధుమపిండిని తీసుకొని,  ఊరి చివరకి  అంటే షిర్డీ గ్రామపు పొలిమేరలోకి వెళ్లి,ఆ గ్రామం పొలిమేర చుట్టూ విసిరారు.అక్కడున్న భక్తులెవ్వరికీ బాబా అలా ఎందుకు చేయించాడో అర్థంకాలేదు.నిజానికి  ఆ సమయంలో షిర్డీలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ కలరా వ్యాధి బాగా వ్యాపించి వుంది. షిర్డీ గ్రామ ప్రజలు కలరా వ్యాధినుంచి,తమను  కాపాడాలంటూ అంతకుముందే  సాయిబాబాకి విజ్ఞప్తి చేశారు.భక్తుల విజ్ఞప్తిమేరకు, కలరా వ్యాధిని నివారించడం కోసమే బాబా తిరగలి విసిరి, గోధుమ పిండి తయారు చేసి దాన్ని ఊరి చివర పారబోసి రమ్మన్నారు.   బాబా అలా ఎప్పుడైతే ఊరి పొలిమేరల్లో గోధుమ పిండిని చల్లించారో ఆ క్షణం నుంచే షిర్డీలోనూ,చుట్తుపక్కల గ్రామాల్లోనూ కలరా తగ్గుముఖం పట్టడం ఆరంభమయ్యింది.బాబా విసిరింది గోధుమలను కాదని...

       కలరా మహమ్మారినే పిండి చేసి ఊరి చివర పారబోయించారని భక్తులకి అప్పుడు అర్థమయ్యింది, బాబా ఏ పని అయినా ఎందుకు చేస్తున్నారో చెప్పరు.. కానీ చేసే ప్రతి పని వెనుక ఒక  అంతరార్థం వుంటుందని  భక్తులందరికీ అర్థమయ్యింది.బాబా ఇలాంటి విచిత్రమైన లీలలెన్నో చేసి,భక్తుల్ని రక్షిస్తాడుగనుకే ఆయనని అందరూ దైవాంశ సంభూతుడిగా భావించి ఆయనని ఆరాధ్యదైవంగా కొలిచేవారు.హేమాడ్ పంతులాంటి కొందరు భక్తులైతే బాబాని దర్శించుకోవడానికి షిర్డీకి వచ్చి,బాబా చూపిన లీలల్నీ మహిమల్నీ స్వయంగా చూసి,బాబా అనుచరులుగా మారిపోయి,  షిర్డీలోనే స్థిరపడిపోయారు. షిర్డీ సాయి సమాధిచెందేవరకూ  ఇలాంటి లీలల్ని మహిమల్నీ ఎన్నింటినో చూపారు.బాబా సమాధిచెంది చాలా కాలం అయినా కూడా ఇప్పటికీ భక్తుల్ని రక్షిస్తూనే ఉన్నారు. జగద్రక్షకుడైనా ఆ షిర్డీ సాయి పాదాలపై ప్రణమిల్లుతూ మనల్ని కూడా చల్లగా చూడమని కోరుకుందాం...శ్రీ సఛ్చిదానంద సమర్థ సద్గురూ సాయినాథ్ మహరాజ్ కీ జై....    

Comments