ఇండస్ట్రీ లో నిలువలేకపోతున్న స్టార్ హీరో వారసులు | Tollywood Top Actors Son Latest News

                ఇండస్ట్రీ లో నిలువలేకపోతున్న స్టార్ హీరో వారసులు 

     వారసత్వం కేవలం ఛాన్స్ మాత్రమే ఇస్తుంది..ఒకసారికాకపోతే మరొకసారి ఇస్తుంది.. అంతేగానీ అంతా వారసత్వమే చూసుకుంటుంది.. దానితోనే నెట్టుకొస్తామని అనుకుంటే.. ఇండస్ట్రీలో కొట్టుకు పోవాల్సిందే. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో నిత్యం నిరూపితమవుతూనే ఉంది. స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి.. సక్సెస్ కాలేని నటీనటులు ఎందరో ఉన్నారు. వారసత్వంతో అరంగేట్రం చేసి.. వార్‌లో నిలవలేకపోయిన వాళ్లెందరో ఉన్నారు. నాటి నుంచి నేటి తరంలోనూ పలువురు ఎదురీదుతూనే ఉన్నారు. అదేమిటోగానీ.. అనామక స్థాయి నుంచి అసామాన్యులుగా ఎదిగిన చోటనే.. అసామాన్య కుటుంబం నుంచి అడుగుపెట్టి అనామకంగా మారిన వారూ మనకు కనిపిస్తున్నారు.అసమాన ప్రతిభ, అహర్నిశలు శ్రమతో చిరంజీవి పెద్ద హీరోగా అవరించారు. ఆయనతోనే మెగా ఫ్యామిలీ ఏర్పడింది. ఈ ఫ్యామిలీ నుంచి పలువురు సక్సెస్ కాగా, మరికొందరు మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. ముందుగా ఆయన సోదరుడు నాగబాబు కూడా నటనారంగంలో నిలదొక్కుకోలేకపోయారనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లు మాత్రం స్టార్ ఇమేజ్ను సంపాదించారు.

     చిరంజీవి తనయుడు రాంచరణ్ తానంటే ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మగధీర, రంగస్థలం లాంటి విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సాయిధరమ్‌తేజ పరవాలేదని అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం నాగబాబు కుమార్తె నిహారిక, శిరీశ్ తడబడుతూనే ఉన్నారు. ఆమె మూడు వరుస ప్లాపులతో కెరీర్ పరంగా డౌన్లోనే ఉంది. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి కొందరు దూసుకెళ్తుంటే.. మరికొందరు మాత్రం నిలవలేకపోతున్నారు.ఇక నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుటుంబంలోనూ ఇదే పరిస్థితి ఉంది. హీరో బాలకృష్ణ తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్నారు. పౌరాణికం, సాంఘీకం, చారిత్రకం ఇలా ఏ రంగంలో అయినా తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఇదే ఫ్యామిలీలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సత్తా ఏమిటో ఇప్పటికే ప్రూప్ చేసుకున్నారు. మరోవైపు తారకరత్న ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిలదొక్కుకోలేకపోయాడు. విభిన్న పాత్రలు చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.

    ఇక హరికృష్ణ కొన్ని సినిమాలకే పరిమితమయ్యాడు. అయితే, కళ్యాణ్ రామ్ ఇప్పటికీ తడబడుతూనే ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ప్రయోగం చేసినా అది ఫలించలేదు.అక్కినేని నాగేశ్వర్రావు కుటుంబం నుంచి నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. ఆయన తనయుడు నాగ చైతన్య అటో ఇటో నెట్టుకొస్తున్నాడు. అఖిల్ మాత్రం ఇంకా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం హీరోలు పెద్దగా సక్సెస్ కాలేదు. చైతు యావరేజ్.. అఖిల్ రెండు సినిమాలు ఫ్లాపే. ఇక సుమంత్‌ను జనాలు హీరోగా చూడడం లేదు. ఇక సుశాంత్ పరిస్థితి అంతే. ఏళ్ల తర్వాత తాజాగా వచ్చిన చి ల సౌ సినిమాతో కాస్త పరువు నిలుపుకున్నాడు. సుమంత్ ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. సుమంత్, సుశాంత్‌కు ఇప్పటికీ బలమైన మార్కెట్ లేదు.దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్ స్టార్ హీరోగా ఎదిగారు.

    ఇక రానా ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అవుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత రానా కెరీర్‌కు కాస్త ఊపు వచ్చింది. దీనిని ఇప్పుడు నిలబెట్టుకోవాలి. మంచు కుటుంబానిదీ ఇదే పరిస్థితి. మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తనయులు విష్ణు, మనోజ్‌లు ఇప్పటికీ స్టార్ ఇమేజ్ను సంపాదించుకోలేకపోతున్నారు. మోహన్‌బాబు తనయ లక్ష్మి కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వీళ్లు వరుస డిజాస్టర్లతో ప్రేక్షకులను బోర్ కొట్టించేస్తున్నారు.ఇతర నటుల కుటుంబాల నుంచి కూడా పలువురు ప్రయత్నాలు చేశారు.. ఇంకా చేస్తున్నారు. సాయి కుమార్ అబ్బాయి ఆది రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. హాస్యనటుడు బ్రహ్మానందం కుమారుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు, . సీనియర్ కామెడీ హీరో నరేశ్ కుమారుడు.. ఇలా మరికొందరు ట్రై చేశారు గానీ సక్సెస్ కాలేకపోయారు. దీనిని బట్టి సినిమా రంగంలో నిలవాలంటే.. వారసత్వం ఒక్కటే సరిపోదు… వార్‌లో గెలిచే సత్తా కావాలన్న విషయం అర్థమవుతోంది. స్టార్ ఫ్యామిలీ అయినా.. ఇతరులు అయినా.. నటనకు, కష్టానికే తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతారు. తమ గుండెల్లో దాచుకుంటారు.
 

Comments