3రోజుల్లో రావాల్సిన ట్రైన్ ఎన్నిరోజుల్లో గమ్యం చేరిందో తెలిస్తే షాక్..! || Indian Railways Neglected

         ఇది భారత రైల్వే నిర్లక్ష్యానికి పరాకాష్ట...

    ఇప్పుడు మేం చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నిజంగానా? అన్న క్వశ్చన్ వేయొచ్చు. కానీ.. ఇది నిజం. భారత రైల్వేల నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం లాంటి ఈ ఉదంతం ఇప్పుడు అందరిని షాకింగ్కు గురి చేస్తోంది. ఇప్పటివరకూ భారత తపాలా శాఖకు సంబంధించిన కతలు వింటుంటాం. పెళ్లికి పోస్టు చేసిన కార్డు.. పిల్లాడు పుట్టిన తర్వాత చేరిందన్న మాటను వింటాం. తాజా ఉదంతం దానికి మించింది.విశాఖపట్నం నుంచి 1400 కిలోమీటర్ల దూరాన ఉండే గమ్యానికి చేరుకోవటానికి ఒక గూడ్స్ రైలు వేగన్ కు పట్టిన సమయం ఎంతో తెలుసా?  అక్షరాల మూడున్నరేళ్లు. ఇది నిజం. అధికారులు సైతం ఈ విషయం తెలుసుకొని ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. 2014లో బుక్ చేసిన ఈ వేగన్ ఇప్పుడు గమ్యస్థానానికి చేరుకోవటంలో అధికారుల నోట మాట రావటం లేదు.

     ఇంతకూ జరిగిందేమంటే.. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అనే కంపెనీ 107462 వేగన్ లో ఎరువులను పార్సిల్ చేసింది. విశాఖపట్నం పోర్టు నుంచి ఒక షాపు యజమాని రామచంద్ర గుప్తాకు దీన్ని పంపింది. నెలలు గడుస్తున్నా ఎరువుల పార్సిల్ రాకపోవటంతో సదరు యజమాని రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాశాడు. అయినప్పటికీ సానుకూల స్పందన రాలేదు.తనకు రావాల్సిన వేగన్ లో రూ.10లక్షల విలువ చేసే ఎరువులు ఉన్నాయని.. ఆయన పేర్కొన్నా.. సదరు రైలు వేగన్ ను గుర్తించటంలో అధికారులు విఫలమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ వేగన్ దేశ వ్యాప్తంగా తిరుగుతూనే ఉంది. చివరకు పెట్టెలోని ఎరువులన్ని చెడిపోయిన తర్వాత యజమాని వద్దకు చేరింది. ఇందుకు మూడున్నరేళ్లు పట్టింది.

ఈ ఎరువుల్ని యజమాని తీసుకోవటానికి ఒప్పుకోలేదు. వేగన్ ను గుర్తించటంలో అధికారుల తప్పిదమని.. ఎన్నిసార్లు లేఖలు రాసినా ఒక్కరూ గుర్తించలేకపోయారని సదరు యజమాని ఆరోపిస్తున్నాడు. ఆయనకు జరిగిన నష్టాన్ని లెక్కకట్టి రైల్వేశాఖ నుంచి చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Comments