నిద్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు | Unknown Shocking Facts about Sleep in Telugu

              నిద్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు |

     కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర..! అంతకు మించిన సుఖమయ జీవితమేం ఉంటుంది? కానీ ఈ ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా.. తిండి కొరతలా.. ‘నిద్ర కొరత’ కూడా పెరిగి పోతోంది. ఒకప్పుడు మహాత్ముల్లాగా రోజులో ఎంత తక్కువ సమయం నిద్రపోయి.. ఎంత ఎక్కువ సమయం శ్రమిస్తే అంత గొప్ప అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నిద్ర పట్టకపోవటం.. తగినంత సమయం నిద్ర లేక పోవటం.. నిద్ర కోసం మాత్రలను ఆశ్రయిస్తుండటం.. ఇలా నేడు ‘నిద్ర’ అతి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోంది. దీన్నుంచి బయటపడేదెలా?మనిషికి నిద్ర అన్నది అతి ముఖ్యమైన జీవ ప్రక్రియ! దాదాపు మన జీవితంలో మూడింట ఒక వంతు నిద్రలోనే గడిచిపోతుంది. అయితే నిద్రపోయే సమయం అందరిలో ఒకే విధంగా ఉండదు. పసిపిల్లలు రోజుకు 16 గంటలైనా పడుకుంటారు. యుక్తవయస్కులకు సగటున 8-9 గంటల నిద్ర అవసరం. పెద్దలు ఎవరైనా రోజుకి కనీసం 5-9 గంటల సేపు నిద్రపోవటం అవసరం. అయితే కొందరు 5 గంటల సేపు నిద్రపోయినా మర్నాడు చురుకుగా ఉండొచ్చు. మరికొందరు 9 గంటల సేపు నిద్రపోతే గానీ హాయిగా ఉండలేరు.

     ఇలా నిద్ర అవసరం వ్యక్తికీ, వ్యక్తికీ మారచ్చు. అలాగే ప్రతిరోజూ ఒకే విధంగా నిద్ర పట్టాలనీ లేదు. కొన్ని రోజులు బాగా నిద్ర పట్టొచ్చు. మరికొన్ని రోజులు పరిసరాలు, పరిస్థితులు, ఆలోచనల కారణంగా సరిగా పట్టకపోవచ్చు. అయితే ఒకట్రెండు రోజులు నిద్ర తగ్గినంత మాత్రాన పెద్ద సమస్యగా భావించాల్సిన పనిలేదు. కనీసం వారంలో 4-5 రోజులు సరిగా నిద్ర పట్టకుండా గడుపుతుంటేనే సమస్యగా భావించాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీనికి కొంత వయసుతో పాటు వచ్చే మార్పులు కారణమైతే కొంత ఇతరత్రా వేధించే ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతుంటాయి. మన దేశంలో చాలామంది నిద్ర సరిగా పట్టకపోవటం, పొద్దున లేచాక కూడా నిద్ర పోవాలని అనిపిస్తుండటం వంటి సమస్యలతో బాధపడుతున్నా..

   వీరిలో కేవలం 6-7 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుంది. చాలామందిలో జీవన సరళిలో మార్పులతోనే సమస్య సర్దుకుంటుంది. ఉదాహరణకు రోజుకి 6 గంటలు నిద్రపోయే వ్యక్తి హఠాత్తుగా 3-4 గంటలు మాత్రమే నిద్రపోతుండటం, దీంతో మర్నాడు తన పనులు తాను తేలికగా చేసుకోలేకపోవటం, చిరాకు, బద్ధకం, ఏకాగ్రత కుదరకపోవటం, ఉదయం నిద్ర ముంచుకొస్తుండటం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే తేడా వచ్చిందని, ఇలాంటి లక్షణాలు వారంలో కనీసం 4-5 రోజులు కొనసాగితే అది సమస్యగా పరిణమించిందని గ్రహించాలి.అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతతో కొత్త కొత్త ప్రయోగాల్ని.. అధ్యయనాల్ని చేపడుతున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండటమే కాదు.. క్రమశిక్షణ లేని జీవితాన్ని గడిపే వారికి ఒక వార్నింగ్ గా మారిందని చెప్పాలి.ఒక్కరోజు సరిగా నిద్ర పోకున్నా అల్జీమర్స్ ముప్పు పెరుగుతుందన్న కొత్త విషయం తాజాగా వెల్లడైన అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. మెదడులోని బీటా అమిలోయిడ్ గా పిలిచే ప్రోటీనులు ఉంటాయని..

     ఇవి ఒక చోట పోగుపడటంతో అమిలోయిడ్ వ్యర్థాలు పేరుకుంటాయని తేల్చారు. ఇవి.. అల్జీమర్స్ ముప్పును పెంచుతాయని గుర్తించారు.తాజాగా అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిపుణులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. 22 నుంచి 72 ఏళ్ల మధ్యనున్న వారిలో 20 మంది ఆరోగ్యవంతుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో ప్రోటీన్.. నిద్రలేమికి మధ్యనున్న సంబంధాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.వీరి మెదడు స్కానింగ్ చిత్రాల్ని పరిశోధకులు పరిశీలించారు. సరిగా నిద్రపోని రోజుకు సంబంధించిన చిత్రాల్ని చక్కగా నిద్రపోయిన రోజు నాటి చిత్రాలతో పోల్చారు. నిద్ర సరిగా పోని రోజున మెదడులోని బీటా అమిలోయిడ్ ప్రోటీన్ స్థాయిలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించారు. ఒక రోజు పూర్తిగా నిద్రపోని పక్షంలో గరిస్ఠంగా 5 శాతం ప్రోటీన్లు ఎక్కువ అవుతున్న విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో పూర్తిగా నిద్ర పోని రోజు తర్వాత చక్కగా నిద్రపోతే.. ఈ ముప్పు తగ్గుతుందా?  అన్న ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే.. సరిగా నిద్ర పోని వారికి ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అల్జీమర్స్ ముప్పు పొంచి వుంది ...

Comments