కుక్కలు దెయ్యాన్ని చూడగలవా..?? ||

  కుక్కలు దెయ్యాన్ని చూడగలవా..

 దెయ్యం.. ఈ పేరు చెబితేనే చాలామందికి గుండెల్లోగుబులు పుడుతుంది. అయితే మీరెప్పుడైనా దెయ్యాన్ని కళ్లారా చూశారా? పోనీ అవి ఉన్నాయని నమ్ముతారా..? దెయ్యాలు, భూతాలు ఏంటి బాస్, అంతా ట్రాష్ అంటారా! నిజానికి దెయ్యాలున్నాయని కొందరు, లేవని మరికొందరు అంటుంటారు. ఈ వాదులాట ఎప్పుడూ ఉండేదే. కానీ జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే.. దెయ్యాలు, ఆత్మలు లాంటివి ఉన్నాయేమోనన్న సందేహాలు మనలో చాలా మందికి కలుగుతుంటాయి. 
మీ కుక్క ఎప్పుడైనా ఎటో చూస్తూ మొరగడం గమనించారా..? అక్కడేమీ లేకపోయినా.. కుక్క అలా వింతగా ప్రవర్తించడం చూశారు కదా...? దానికి కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా..? కుక్కలకు దుష్టశక్తులు కనిపిస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. మన  కంటికి కనిపించని దెయ్యాలు.. వాటికి కనిపించడం వల్లే అవి అలా ప్రవర్తిస్తూ ఉంటాయని అంటుంటారు. ఇందులో నిజమెంత..? 

2009లో టెయిల్స్ ఆఫ్ ఆఫ్టర్లైఫ్ పేరిట పెగ్గీ స్కీమిడ్త్ ఒక పుస్తకాన్ని రాశారు. కుక్కల వింత ప్రవర్తనకు సంబంధించి  నిజ జీవితంలోని కొన్ని ఘటనలను అందులో ప్రస్తావించారు.  డెల్ జాన్సన్ అనే మహిళ ఒక రోజు చనిపోయింది. బతుకున్నప్పుడు ఆమె ఏడు కుక్కలు, ఆరు పిల్లులను పెంచేది. తన పెంపుడు జంతువుల కోసం డెల్ జాన్సన్ ఆత్మ అప్పుడప్పుడూ వచ్చేదన్న ప్రచారం ఉండేది. అందుకు తగ్గట్టు కుక్కలన్నీ ఒక చోటకు చేరి .. ఏదో చూస్తూ అరిచేవట.

 తమ యజమానురాలు కనిపించడం వల్లే అవి అలా ప్రవర్తించేవంటూ పెగ్గీ తన పుస్తకంలో వివరించారు. అంటే కుక్కలు ఆత్మను చూడగలిగాయా..? మనుషులకు కనిపించని ఆత్మలను అవి ఎలా చూడగలుగుతున్నాయి..? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే అసలు కుక్కలకు మనుషులకు మధ్య ఉన్న కొన్ని తేడాలు తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
వాసన చూసి నేరస్తులను  పోలీసు జాగిలాలు ఇట్టే పట్టేస్తాయని మన అందరికీ తెలిసిందే. నేరం జరిగిన ప్రాంతంలో వచ్చే వాసనను బట్టి అంతకు ముందు అక్కడ ఉన్నదెవరన్న సంగతిని గుర్తిస్తాయి. వాస్తవానికి కుక్కలకు వాసన చూసే శక్తి  చాలా ఎక్కువ. తన యజమాని ఇంటికి వస్తున్న సంగతి..అతడు దూరంగా ఉండగానే కుక్కలు పసిగట్టేస్తాయి. తోకూపుతూ, మొరుగుతూ ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి.

 బ్రీడ్ను బట్టి మనుషుల కంటే వాటికి వాసన చూసే శక్తి  వెయ్యి నుంచి 10 వేల రెట్లు అధికంగా ఉంటుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది. 
 కుక్కలకు వినికిడి శక్తి కూడా ఎక్కువే. మనతో పోలిస్తే నాలుగు రెట్లు దూరంలో అయిన శబ్దాలను కూడా అవి స్పష్టంగా వినగలవు. అంతే కాదు..వాటి రెసిప్షన్ వాల్యూమ్ ఇంటెన్సిటీ కూడా ఎక్కువే. అంటే మనకు వినిపించిన దాని కంటే గట్టిగా వాటికి శబ్దాలు వినబడతాయి. నేరస్తుడి గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి అతడు తప్పు చేశాడా లేదా అని ఇట్టే కనిపెట్టేస్తాయి.  అందుకే నేరాలకు సంబంధించి నూటికి 90 శాతం కేసుల్లో డాగ్ స్క్వాడ్ కీలకమవుతూ ఉంటుంది.
శునకాలకు వినికిడి శక్తి, స్మెల్లింగ్ పవర్ ఎంతలా ఉంటాయంటే.. యజమాని శరీరంలోని బ్లడ్ షుగర్స్ లెవల్స్ కూడా కనిపెట్టేయగలవు. యూరిన్ స్మెల్ బట్టి రోగాలను గుర్తించగలవు. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటివి వస్తాయనే విషయం అవి ముందుగానే గ్రహించగలవు. మన శరీరంలో చిన్న కణం దెబ్బతిన్నా.. ఆ వాసనను అవి పట్టేస్తాయి. 

కొన్ని వన్య ప్రాణుల్లాగే కుక్కలకు కూడా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ముందుగా తెలిసిపోతుంది. అంటే మరికాసేపట్లో వర్షం పడబోతోందనో.. ఇంకాసేపట్లో భూకంపం రాబోతోందనో అవి ముందుగా గ్రహించేస్తాయి. తన యజమానిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తాయి. 2004 సునామీ వచ్చే ముందు వేలాది కుక్కలు వింతగా ప్రవర్తించాయట. ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే.. భయంతో మంచం కింద దూరడమో చేశాయి.

ప్రమాదాల నుంచి యజమానులను కుక్కలు కాపాడాయంటూ.. న్యూస్ హెడ్లైన్స్లో మనం చాలా సార్లు చూసే ఉంటాం. ప్రమాదం జరుగుతుందని ముందుగా పసి గట్టి అవి అప్రమత్తం చేస్తాయి. పైగా కుక్కలకు అపారమైన విశ్వాసం ఉంటుంది. యజమానికి కోసం ప్రాణమిచ్చేందుకు సైతం అవి వెనకాడవు. ఎప్పుడో 14 వందల సంవత్సరాల క్రితం మచ్చికైన కుక్క మనకు మంచి నేస్తలుగా ఉంటున్నాయి. 

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే .. కుక్కలకు రెండేళ్ల పిల్లలకు ఉండే తెలివితేటలు ఉంటాయట.  దేన్నైనా మనం చూసే కోణంలో రెండేళ్ల పసివారు చూడలేరు. పైగా ఎక్కడో ఎదో జరిగితే పనిగట్టే కుక్కులు.. ఆ విషయాన్ని  తన యజమానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. భయం, ఆనందం, బాధ, తపన పంచుకునేందుకు పసివాడిలా తాపత్రయపడతాయి. కానీ అవేవీ అర్థకాని యజమాని పెద్దగా పట్టించుకోడు. దాంతో అవి అనుభవించే మానసిక క్షోభ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


ఇక అసలు విషయానికి వస్తే.. దేయ్యాలని కుక్కలు చూడగలవా లేదా అన్నది సైంటిఫిక్గా ఇప్పటివరకు ఫ్రూవ్ కాలేదు. కుక్కల మనసులో ఏముందో తొంగి చూసే టెక్నాలజీ కూడా ఇంకా రాలేదు. అందుకే ఎప్పుడైనా ఒక చోటకు చేరి మీ కుక్క మొరుగుతోందంటే దాని అర్థం అక్కడ తెలియనీ శక్తి  ఏదో ఉండొచ్చు. లేదా.. దూరంగా జరిగిన ఏదో పరిణామానికి అది స్పందించడమైనా కావొచ్చు. అయితే ఈ రెండింటిలో స్పష్టమైన సమాధానం ఏంటన్నది మాత్రం మీ ఊహకే వదిలేస్తున్నాం.
 

Comments