భక్తుల ఇంటికి మారు వేషంలో వస్తున్న బాబా..! | Shirdi Sai Baba Miracles | Sai Baba Thursday Stories

 దేవుగారింట జరిగిన ఉద్యాపన వ్రతానికి మారువేషంలో వెళ్లిన బాబా....

కలియుగ దైవంగా భక్తులు పిలుచుకొనే ఆ షిర్డీ సాయి జీవించి ఉన్నకాలంలో ఆయన చూపిన  లీలలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.అలాంటి లీలల్లో దేవుగారింట ఉద్యాపన వ్రతం  సందర్భంగా చూపిన ఒక లీల గురించి తెలుసుకుందాం...

 మహా రాష్ట్రలోని ఠాణే జిల్లాలో ఉన్న దహనులో బి.వి.రావుగారు నివశించే వారు.ఆయన బాబా భక్తుడు. ఆయన  తల్లి యింటిలో   30 నోములు నోచుకుంది.ఆ నోములు పూర్తి  అయిన తర్వాత, వాటి  ఉద్యాపన చేయవలసి ఉంది. ఈ కార్యక్రమానికి 100నుంచి  200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉంది. ఈ శుభకార్యానికి  ముహూర్తం   నిశ్చయించిన  దేవుగారు, బాపూసాహెబు జోగ్ గారికి ఒక లేఖ వ్రాశారు.

 ఆ లేఖలో   ఈ శుభకార్యానికి  బాబాగారు  దయచేయాలనీ,తన తరపున ఆయనతో చెప్పమంటూ ఆ లేఖ రాశారు. బాబాగారు రాకపోతే ఆ కార్యక్రమం అసంతృప్తికరంగా ఉంటుందని కూడా వ్రాశారు. జోగ్ కి ఆ లేఖ అందగానే జోగ్,ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి  వినిపించారు.  మనఃపూర్వకమైన దేవ్ విజ్ఞాపనను విని బాబా ఇలా అన్నారు. "నన్ను గుర్తుంచుకునే వారిని నేను మరవను. నన్ను పిలిచిన వారి దగ్గరకు తప్పకుండా వెళ్తాను.అలా వెళ్లడానికి నాకు బండికాని, టాంగాగాని, రైలుగాని, విమానంగాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి వద్దకు నేను పరుగెత్తివెళ్ళి ప్రత్యక్షమవుతాను...అని చెప్పి, దేవ్ కి సంతోషంగా జవాబు వ్రాయి. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వస్తామని వ్రాయి.''అని  జోగ్ కి చెప్పగా  బాబా చెప్పింది చెప్పినట్తు దేవుకు జోగ్ జవాబు వ్రాశారు.

 ఆ ఉత్తరమందగానే దేవుగారు ఎంతో సంతోషించారు.  ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకరు గోసంరక్షణ కోసం సేవ చేస్తూ,చందాలు వసూలు చేసే నెపంతో దహను స్టేషన్ మాస్టారు దగ్గరికి  వచ్చారు.  స్టేషన్ మాస్టారు, సన్యాసిని ఊరి లోపలికి వెళ్ళి దేవుగారిని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమని సలహా యిచ్చారు. అంతలో దేవే  అక్కడికి రావడంతో స్టేషను మాస్టారు,  సన్యాసిని దేవుగారికి పరిచయం చేశారు.  దాంతో వారిద్దరూ  ప్లాట్ ఫారమ్ మీద కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. అప్పటికే ఆ  ఊరిలో  రావుసాహెబు నరోత్తమ శెట్టి అనే వ్యక్తి ఏదో కార్యం నిమిత్తం చందాలు వసూలు చేస్తుండడంతో, మరో పనికోసం ఇప్పుడే గ్రామస్థుల్ని చందాలు అడగడం బాగోదని  చెప్పి దేవ్ అతన్ని 3, 4 మాసాల తరువాత   రమ్మని అన్నాడు..

 ఈ మాటలు విని అది సబబుగానే ఉందనుకొని ఆ సన్యాసి అక్కడినుండి వెళ్ళిపోయారు.  ఒక నెల తరువాత  అదే   సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి యింటిముందు ఆగారు.  ఆ సన్యాసి ఛందాల కోసం వచ్చారేమోనని దేవు అనుకున్నారు. అది గ్రహించిన ఆ సన్యాసి, తాను ఛందాల కోసం రాలేదని ఉద్యాపన భోజనానికి వచ్చానని  చెప్పారు. అందుకు దేవు అతన్ని సాదరంగా ఆహ్వానించగా, అప్పుడు సన్యాసి "ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారని అంటాడు.  మంచిది వారిని కూడా రమ్మనండి.. అని ,భోజనానికి ఇంకా రెండుగంటల కాలపరిమితి ఉండటంతో,వారిని రెండుగంటల తర్వాత రమ్మని చెప్పి,ఈలోపు ఎక్కడైనా కాలక్షెపం చెయ్యమని చెప్పి,మీరు ఎక్కడ ఉంటారో చెబితే అక్కడికి భోజనాల సమయానికి మనిషిని పంపిస్తానని అంటాడు.  దానికి సన్యాసి ఎవరినీ పంపవలసిన అవసరం లేదనీ,భోజన సమయానికి  తామే స్వయంగా వస్తామని చెప్పారు. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పగా, సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన తరువాత వెళ్ళిపోయారు. ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపూసాహెబు జోగుకి ఉత్తరం వ్రాశారు.

 ఆ ఉత్తరంలో ఆ కార్యక్రమానికి వస్తానని  బాబా తన మాట తప్పారని వ్రాశారు.ఉత్తరం అందగానే  జోగు ఆ ఉత్తరం తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళారు. దాన్ని తెరవకముందే బాబా ఇలా అన్నారు. "హా! వాగ్థానం చేసి, దగా చేశానని అంటున్నాడు. ఇద్దరితో కలిసి నేను సంతర్పణకు హాజరయ్యాను. కాని నన్ను పోల్చుకోలేక పోయాడు. అలాంటివాడు నన్ను ఎందుకు పిలవాలి? సన్యాసి ఛందాల కోసం వచ్చానని  అనుకున్నాడు. అతని సంశయాన్ని తొలగించటం కోసమే మరి ఇద్దరితో వస్తానని అన్నాను. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలైనా విడుస్తాను. నా మాటను నేను ఎప్పుడూ పొల్లు చేయను.'' అని రాయమనగానే ఈ జవాబు చూడగానే జోగ్ హృదయం  ఆనందంతో ఉప్పొంగిపోయింది.జోగ్ అలాగే జవాబు రాశాడు.

 ఆ ఉత్తరం అందిన తర్వాత దానిలో రాసిన   బాబా సమాధానం అంతా దేవుగారు  చదవగానే దేవుకు కళ్లనుండి ఆనందబాష్పాలు రాలాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాప పడ్డారు. ఆ రోజు సన్యాసి మొదటి రాకతో తాను ఎలా మోసపోయానో, సన్యాసి చందాలకు రావడం, మరి ఇద్దరితో కలిసి భోజనానికి వస్తాననే మాటలు తాను గ్రహించలేక  పోవటం - మొదలైనసంఘటనలు  అతనికి ఆశ్చర్యాన్ని కలగజేశాయి.ఈ సంఘటన జరిగిన దగ్గర్నుంచీ దేవ్,బాబాకి ప్రియభక్తుడిగా మారిపోయాడు.ఈ దేవ్ సంఘటనని  బట్టి,భక్తులు మనస్ఫూరిగా ఆ సాయి  సద్గురువును శరణు వేడుకుంటే, ఆ సమర్థ సద్గురువు అయిన సాయిబాబా, తమ భక్తుల ఇళ్లలోని  శుభకార్యాలను సవ్యంగా నెరవేరేలా చూస్తారనేది స్పష్టంగా తెలుస్తోంది.అంతెకాదు  ఈ కథవల్ల సాయిని మనం వేడుకోగానే అతను మన యింటికి ఏదో రూపంలో వచ్చి,మన కష్టాల్ని తీర్చి వెళ్తాడని ఈ కధ ద్వారా స్పష్టమవుతుంది.ఈ విధంగా బాబా జీవించి ఉన్నకాలంలో ఎందరో భక్తులకి ఎన్నో రూపాల్లో కనిపించి వారిని ఆదుకున్నారు.సమర్థ సద్గురుడైన ఆ సాయిబాబాకి మన కష్టం కూడా చెప్పుకొని,మనకి కూడా ఒక్కసారి ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని యిప్పించమని వేడు కుందాం.. మన కష్టాల్ని కూడా తీర్చివేయమని మనస్ఫూర్తిగా అర్థించుదాం...  ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పాదాలపై భక్తితో ప్రణమిల్లుదాం...శ్రీ సఛ్ఛిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై... అంటూ హృదయపూర్వకంగా జేజేలు అర్పిద్దాం...   

 

Comments