తన తల తానే నరుక్కుని రాక్షసుల దాహం తీర్చిన దేవత | The Goddess who demolished the monsters | Sumantv

టైటిల్: తన తలను ఖండించుకొని  రాక్షసుల ఆకలి తీర్చిన చండీ దేవిని దర్శిస్తే....

  దేశవిదేశాల్లో ఉన్న 52 శక్తి పీఠాల్లో చింత పూర్ని  క్షేత్రంకూడా ఒకటి. హిమాలయాల్లో ఉండే ఈ ఆలయంలోని దేవతని అందరూ చిన్మస్తికా దేవిగా కొలుస్తారు.ఈమెనే వజ్రవైరోచనీ అనీ,ప్రచండ చండీ అనీ,వజ్రయోగినీ అని కూడా పిలుస్తారు.తన తలని తానే ఖండించు కొని,ఆ రక్తాన్ని ఆమెతాగుతూ ఆమెకి ఇరుపక్కలా ఉండే డాకినీ వర్ణిలుగా పిలిచే జయా విజయలు కూడా తాగుతూ  ఉన్నట్టుగా ఉండే ఇక్కడి విగ్రహం అందరినీ భయకంపితుల్ని చేస్తుంది.పైకి రౌద్రాకారంగా కనిపిస్తున్నా,ఆమె చాలా శాంతమూర్తి.భక్తితో  ఆమెని పూజించేవారి కోరికలన్నీ నెరవేరుతాయని స్థానిక భక్తులు చెబుతూ ఉంటారు. అసలు ఆ దేవత చింతపూర్ణిలో ఆ రూపంలో  కొలువైయుండడానికి గల కారణాలేమిటో,ఆమెని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం....

 ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ  జగన్మాత కొలిచేవారికి కొంగు బంగారం. ఆరాధించేవారికి  యిష్ట  దేవత.ఆమె ఒక్కచోట శాంతమూర్తిగానూ, మరో చోట కరుణామూర్తి గానూ ,ఇంకోచోట  రౌద్రమూర్తిగానూ కనిపిస్తూ భక్తులని ఆకర్షిస్తుంది.కరుణామయి అయిన ఆ తల్లి,ఎక్కడ ఏరూపంలో కనిపించినా నిజానికి ఆమె శాంతమూర్తే. భక్తులు కోరిన  కోరికల్ని  తీర్చేటప్పుడు శాంతమూర్తిగా, రాక్షసుల్ని దునుమాడేటప్పుడు రౌద్రాకారిణిగా కనిపించే ఈ అమ్మ భక్తుల పాలిట కల్పవల్లి అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.అలాంటి శాంతమూర్తి అయిన ఆ జగన్మాత,రౌద్రాకారిణిగా వెలసిన క్షేత్రమే చింతపూర్ణి క్షేత్రం.

  హిమాలయాల్లో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు అకారణంగా వచ్చే కామకోరికల్ని జయిస్తారనీ,ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చలించని వ్యక్తులుగా మారతారనీ,ఆ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయనీ చెబుతారు.అందుకే దేశవిదేశాలనుంచి ఎన్నోవేల మంది ఈ చింత పూర్ణి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారని తెలుస్తోంది. విష్ణుమూర్తి ఖండించిన సతీదేవి మృతశరీరభాగాల్లోని ఒక భాగం ఈ క్షేత్రంలో పడినట్టుగా చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని 52 శక్తి  పీఠాల్లో ఒకటిగా చెబుతారు.ఈ క్షేత్రంలో కొలువైయున్న అమ్మవారు తన తలను తానే ఖండించుకొని, ఆ తలనుంచి వస్తోన్న రక్త ధారల్ని తానూ మరియు తన చుట్టూ ఉన్న జయా విజయులు తాగుతున్న రూపంలో కనిపిస్తూ ఉంటుంది.దీనికి  పూర్వకాలపు     కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే, మార్కెండేయ పురాణం ప్రకారం పూర్వం కాళికా రూపమైన చండీ  దేవికి, రాక్షసులకు ఘోరమైన  యుద్ధం జరుగుతుంది.

  ఈ యుద్ధంలో చండిమాత  రాక్షసుల్ని సంహరించి  విజయాన్ని సాధిస్తుంది.    యుద్దంలో ఆ తల్లికి జయ, విజయ అనే ఇద్దరు రాక్షసులు  సహాయం చేస్తారు.అయితే వారిద్దరూ యుద్ధంలో ఆమెకి సహాయంచేసి,ఎంతమంది రక్తాన్ని జుర్రుకున్నా  వారి దాహం గానీవారి  ఆకలిగానీ తీరవు. దాంతో వారిద్దరూ తమ దాహాన్ని తీర్చాల్సిందిగా ఆ చండికని కోరతారు.దాంతో ఆ చండీమాత  తనచేతిలో ఉన్న ఖడ్గంతో తన  తలను తానే ఖండించుకొనగా,  ఆమె  మొండెం నుంచి పైకి చిమ్మె రుధిర ధారల్ని  అంటే రక్త ధారల్ని జయ, విజయలు తాగగా,వారి ఆకలి తీరుతుంది. అంతేకాదు,అలా చిందిన ఆ రక్తాన్ని ఆమె ఖండించుకున్న ఆమె తలకూడా తాగుతుంది. తర్వాత ఆ దేవత అక్కడే అదే రూపంలో ఆ క్షేత్రంలో కొలువైయుంది.అందుకే  ఇక్కడి దేవతను అందరూ చిన్మస్తికా దేవి పేరుతో పిలుస్తూ, కొలుస్తారు. చిన్ అంటే లేనిది అనీ, మస్తిక అంటే తల అని అర్థం.చిన్మస్తిక అంటే తలలేనిది అని అర్థం.

  ఈ దేవతను ఎక్కువగా అఘోరాలు పూజిస్తున్నట్తుగా కొందరు చెబుతారు. ఈ శక్తిపీఠాన్ని రుద్ర దేవుడు అయిన పరమశివుడు నలు దిక్కులా కాపాడుతూ ఉంటాడని స్థలపురాణం చెబుతోంది.    చిన్తపూర్ని ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ప్రతి ఒక్కరూ తల పై షాల్ కాని, టోపీ కాని ధరించాల్సి ఉంటుంది. స్త్రీలు అయితే తలపై కొంగుని తప్పక కప్పుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ సంప్రదాయ వస్త్రాలనే ధరించాల్సి ఉంటుంది. ఆలయంలోకి తోలుతో చేసిన ఎలాంటి వస్తువుల్నీ  అనుమతించరు. చిన్మస్తాదేవిని ఆరాధించే భక్తులకు ఆమె ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు.అనేక మానసిక బంధనాలనుండి విముక్తులని  చేసి, వారికున్న శత్రు  పీఢల్ని తొలగిస్తుంది.అందుకే తాంత్రిక పూజలు చేసేవారు తమని తాము శత్రువులనుంచి కాపాడుకోవడానికై ఇంకా నిరాటంకంగా మత్రసిద్ధి సాధించేందుకు చిన్మస్తాదేవిని పూజిస్తారు.

  ఈ క్షేత్రంలో ప్రతి ఏటా జులై-ఆగస్టు మధ్య అమ్మవారికి సావనాష్టమి పేరుతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వీటికి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. అదే విధంగా దసరా నవరాత్రులు, కార్తిక మాసం, పౌర్ణమి రోజుల్లో కూడా ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.   హిమాలయ పర్వత పంక్తుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి దాదాపు 3,117 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా అనే ప్రాంతమునుంచి,    47 కిలోమీటర్ల దూరంలో  ఈ చిన్మస్తాదేవి క్షేత్రం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్  లోని ఉనాలో బస్సు, రైలు సదుపాయాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రంలో మంగళ, శుక్ర, శని, ఆదివారాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువమంది భక్తులు వస్తున్న కారణంగా ఆయా రోజుల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది.. ప్రపంచంలో ఎక్కడాలేనట్తుగా వింతైన రౌద్రాకార రూపంలో ఉండే ఈ చిన్మస్తకా దేవిని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి తీరాల్సిందే. అలా దర్శిస్తె మీకోరికలన్నీ  నెరవేరతాయని స్థలపురాణం చెబుతోంది.కాబట్టి మీరుకూడా ఈ క్షేత్రానికి వెళ్లి అమ్మవారిని దర్శించి, మీ కోరికల్ని తీర్చుకొని, ఆ అమ్మవారి ఆశీర్వాదాల్ని  అందుకోండి..

 

Comments