Aravinda Sametha Review and Rating || Jr NTR || Pooja Hegde || Trivikram Srinivas

               కాలర్ ఎగేరేసుకుని తిరిగే మూవీ

               యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అరవిందసమేత వీరరాఘవ". రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన ఈ మూవీ అంతా అరవింద అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ కేరెక్టరే సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. ఫ్యాక్షనిజం ఆధారంగా ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. రెండు ఊర్ల మధ్య ఏర్పడ్డ వైరం కారణంగా రక్తపాతాలు జరగడం, పగలూ, ప్రతీకారాలు పెంచుకోవడం, చివరికి హీరో విలన్స్ ని  చంపడం. ఇప్పటివరకూ ఈ ఫార్మాట్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇద్దరి మనుషుల మధ్య వైరాన్ని ఊరి సమస్యగా మార్చి ఊరిని స్మశానం చేస్తుంటే హీరో వెళ్ళి ఊరిని ఒకటి చేస్తాడు. ఈ ఫార్మాట్ లో బృందావనం, మిర్చి సినిమాలు వచ్చాయి. సరిగ్గా ఇలానే ఇప్పుడు అరవింద సినిమా వచ్చింది. కానీ ఆ మూవీస్ కి, ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ విషయంలో చాలా తేడా ఉంది. కధలోకి వెళ్తే, నారప్పరెడ్డి బిడ్డ వీరరాఘవరెడ్డి. తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళ కుటుంబాన్ని నరికి చంపాలని పగతో రగిలిపోతుంటాడు. పులిలా అందరినీ నరుక్కుంటూ పోతున్న రాఘవకి, అరవింద ప్రేమ కారణంగా పగా, ప్రతీకారాలు పోయి బంధాలు, వాటి భావోద్వేగాలు తెలుస్తాయి.

           ఒక పక్క వీరరాఘవరెడ్డి నాన్నమ్మ, అతనిలో పగా, ప్రతీకారాలను నూరిపోస్తుంది. "కత్తి బిడ్డ లాంటిది లోపమైతాందా" అని రాఘవరెడ్డిని పగతో రగిలేలా చేస్తుంది. ఎందుకంటే మానవత్వం లేని మృగాలు ఊరి మీద పడి మనుషుల్ని తినేస్తున్నాయి. ఇక మరో పక్క "వాడిదైన రోజు ఎవడైన గెలుస్తాడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు. చూడు. వాడు గొప్పోడు" అని అరవింద, రాఘవలో ఉన్న మనిషిని మేల్కొల్పుతుంది. ఆ మాటలకి రియలైజ్ అయిన, రాఘవలో కొత్త కోణం బయటపడుతుంది. చివరికి గొడవ జరక్కుండా ఎలా ఆపడం కోసం రాఘవరెడ్డి ఏం చేశాడన్నది  తెర మీదే చూడాలి. ఎందుకంటే ఈ సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా, ఎమోషనల్ గా ఉంటాయ్. ఎన్టీఆర్ నటన ఈ సినిమాను నిలబెట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అద్భుతంగా ఉన్నాయ్. ఈ సినిమాలో ఎన్టీఆర్,...అరవింద బాడీగార్డ్ గా, లవర్ బాయ్ గా, ఫ్యాక్షనిస్ట్ గా, భావోద్వేగాలు ఉన్న సెన్సిటివ్ పర్సన్ గా చాలా  వేరియెషన్స్ చూపించారు.  ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, మాస్ స్టోరీ, చప్పట్లు కొట్టించే డైలాగులు, అత్యంత శక్తివంతమైన క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అలానే పూజా హెగ్డే అందాలు, ఎన్‌టి‌ఆర్ తో కెమిస్ట్రీ, లవ్ సీన్స్ అన్నీ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

                ఇక సునీల్ పాత్ర కొత్తగా ఉంది. సునీల్ గ్యారేజీ నడుపుతుంటారు. అదే గ్యారేజీలో ఎన్టీఆర్ కూడా చేరి సునీల్ కి తోడుగా ఉంటారు. సునీల్ కూడా ఎన్టీఆర్ పక్కన నమ్మిన బంటులా ఉంటూ సందర్భం వచ్చినప్పుడు తన టైమింగ్ తో కామెడీ చేస్తూనే, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కంటతడి పెట్టించారు. ఇక జగపతిబాబు పాత్ర అంతఃపురంలో ప్రకాష్ రాజ్ కేరెక్టర్ ను మైమరిపించేలా ఉంది. అంత భయంకరంగా తన విలనిజాన్ని ప్రదర్శించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ చెప్పిన దాని కంటే రెండింతలు ఇంపాక్ట్ ఉంది జగపతిబాబు కేరెక్టర్. మొదటి భాగమంతా ఎక్కువగా ప్రాసలు, పంచులతో వినోదంగా సాగిపోయే మూవీ ఇంటర్వెల్ కొచ్చేసరికి సీరియస్ వాతావరణం నెలకొంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ మొత్తం గుండెల్ని పిండేసే సీన్స్ ఉంటాయి. తండ్రికి తలకొరివి పెట్టే సీన్ దగ్గర  ఎన్‌టి‌ఆర్ జీవించేశారు. ఆ సీన్ దగ్గర ప్రతీ ఒక్కరికీ కన్నీళ్లు రాకుండా ఉండవు. ఇక తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది. పెనిమిటి సాంగ్ ఐతే గుండెల్ని బరువెక్కించే పాట. ఇక ఈ మూవీలో వచ్చే బి‌ఐ‌టి సాంగ్ లో త్రివిక్రమ్ రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎంతో లోతున్న పదాలని లిరిక్స్ లో వాడారు. టోటల్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా. యంగ్ టైగర్ అభిమానులకు ఇది మరో ఎమోషనల్ ఎంటర్‌ టైనర్. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు. 

Comments