కాకినాడ సుబ్బయ్య హోటల్ ఇపుడు హైదరాబాద్ లో 35 Items మెను ఇదే|Kakinada Subbaiah Hotel now in Hyderabad

               కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఇకపై హైదరాబాద్ లో కూడా

             మన తెలుగు ప్రజలు మెచ్చే హోటళ్ల లిస్టు లో కాకినాడ సుబ్బయ్య గారి  హోటల్ కూడ ఒకటి. మేము మెచ్చిన హోటల్స్ చాలానే ఉన్నాయి, అయినా ఇపుడు అంత దూరం వెళ్ళే తీరిక అస్సలు లేదు అంటారా? ఇంతకీ సుబ్బయ్య గారి హోటల్ గొప్ప ఏంటో? అంటారా...పది రకాల కూరలతో, నేతిని దట్టించిన వేడి వేడి అన్నం సుబ్బయ్య హోటల్ ప్రత్యేకత.  చాలా మంది పనిమీదైనా కాకినాడ వెళితే పనిగట్టుకుని మరీ సుబ్బయ్య హోటల్ కు వెళ్లి కడుపు నిండా లాంచేసి వస్తుంటారు. కాకినాడలో సుబ్బయ్య హోటల్ అంటే అదేదో గోదారోళ్ళే హోటల్ పెట్టారనుకుంటున్నారేమో, కాదు.నెల్లూరు కి చెందిన గునుపూడి సుబ్బారావు గారు కాకినాడ వచ్చి ,అద్దె ఇల్లు తీసుకుని ,చక్కగా పీటలు వేసి అరిటాకుల్లో భోజనాలు పెట్టి అప్యాయం గా కొసరి కొసరి వడ్డించి చుట్టుపక్కల ఊళ్ళలో మంచి పేరు తెచ్చుకున్నారు.సుబ్బయ్య హోటల్ కి బోల్డంత చరిత్ర ఉందినిన్నా మొన్నా పెట్టిన హోటల్ కాదు...సుబ్బయ్య హోటల్ పెట్టి 70  ఏళ్ళకి పైమాటే ….కాకినాడ రామారావు పేట మూడు లైట్ల జంక్షన్ దగ్గరే సుబ్బయ్య హోటల్ ఉంది..ఆరోజునుండీ ఈరోజువరకూ ట్రెండ్ కి తగ్గట్టు మెనూ మారుస్తూ పోటీ ప్రపంచాన్ని తట్టుకుని అలాగే నిలబడింది సుబ్బయ్య హోటల్..హోటల్ వ్యవస్థాపకులు మధ్యనే చనిపోయినా అతని కొడుకులు శ్రీనివాస్ ,శ్రీకాంత్ ఇద్దరూ సమర్ధవంతంగా హోటల్ ని నడుపుతున్నారు .హోటల్ అంటే డాబుగా కనిపిస్తుందనుకునేరు, చూడటానికి మామూలుగానే ఉంటుంది సర్వర్స్ కూడా అతి నార్మల్ గా ఉంటారు.. కానీ హై ఎండ్ క్వాలిటీ భోజనం దొరుకుతుంది అక్కడ..

             అసలు సుబ్బయ్య హోటల్ లో తినడానికి ఆకలికంటే ముందు ధైర్యం ఉండాలి.. అన్ని వెరైటీస్ ఉంటాయి మరి..మన ధైర్యాన్ని సవాల్ చేస్తూ, ఆకులో ముందు స్వీట్ వడ్డించి దాడి చెయ్యడం మొదలుపెడతారు.. చాలా బావుంటుంది ఒకసారి రుచి చూడండి అంటారు వడ్డించేవాళ్ళు.పూతరేకులు, బూరెలు, కాజాలు..నేటి గులాబ్ జాం ఇలా మొదలు పెట్టి పులిహోర..వెజ్ బిర్యానీ దగ్గర ఆగి రైస్ దగ్గరకొచ్చి రకరకాల కూరలు, డీప్ ఫ్రైలు ..పచ్చళ్ళు పొడులు..సాంబారు, రసం..ఆఖరికి మజ్జిగపులుసు, గారెలు ,పెరుగువడలుపెరుగు..ఇలా నలభై రకాలని అలుపు లేకుండా వడ్డిస్తూనే ఉంటారు.. అన్నీ రుచి చూడండి, బూరెల్లో నెయ్యి వేసుకోండి చాలా బావుంటుంది అని సలహా కూడా ఇచ్చేస్తారు సర్వర్లు..కడుపు లో అస్సలు ఖాళీలేదు అని చెప్పినా సరే, లాస్ట్ లో ఒక గ్లాస్ తో మజ్జిగ ఇచ్చి ఇది తాగండి చలవ చేస్తుంది అని అభిమానంగా చెప్తుంటే కాదనాలనిపించదు..నిజానికి ..తినండీ తినండీ అని హోటల్ లోనూ ఎవరూ అనరు. కానీ సుబ్బయ్య హోటల్ లో అలా కాదు అప్యాయంగా వడ్డించాలనే నియమానికి కట్టుబడి ఉండడం సుబ్బయ్య కాలం నుండీ అలవాటైన సంస్కారం అంతే..వడ్డించే ప్రతి వారు, వడ్డిస్తూ ఐటెం ట్రై చేయండి చాలా బావుంటుంది అంటుంటే వీళ్ళెందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనే ప్రశ్న మొదలై బిల్ తోపాటు భారీ టిప్ కూడా ఇవ్వాలా అని అనిపిస్తే….వద్దు అస్సలు ఇలాంటి ఆలోచన అక్కరలేదు ,మీరు సర్వర్ చేతికి టిప్ ఇస్తుంటే అయ్యో వద్దండీ మీరు భోజనం చేసారు అదే సంతోషం అనేస్తారు వాళ్ళు..సుబ్బయ్య హోటల్ కేటరింగ్ సర్వీస్ లో కూడ ముందే ఉంది..తెలుగువంటకాలే కాదు నార్త్ ఇండియన్ రుచులు కూడా సుబ్బయ్య హోటల్ లో ఊరిస్తాయి..ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ అంటే..ఒకపక్క జె.ఎన్.టీ.యూ,మరోపక్క రంగరాయ మెడికల్ కాలేజ్,ఇంకోపక్క కాకినాడ కోటయ్య కాజా..అన్నిటినీ మించి పోటెత్తే సముద్రం, ఇవేకాదు మరోపక్క సుబ్బయ్య హోటల్ కూడా ఉందిఒక్కసారి సుబ్బయ్య హోటల్ లో తింటే ఎప్పటికీ టేస్ట్ ని, ఆప్యాయతని మర్చిపోలేరు..అంత ఫేమస్ సుబ్బయ్య హోటల్ .. అలాంటి హోటల్ త్వరలో హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో మొదలుకానుంది. మరి శాఖాహార భోజన ప్రియులు రెడీగా ఉండండి.

Comments