నల్గొండలో బయటపడ్డ మరో ప్రేమకధ || Naresh Swathi Love Story Ends same as Pranay amruta in Nalgonda

          నల్గొండ జిల్లాలో పరువు హత్యలు నాడు నరేష్, నేడు ప్రణయ్

       ప్రణయ్ ని హత్య చేసింది పరువు కాదు, కులం...అవును అది పరువు హత్య కాదు కులహత్య అనాలి...... మన కులసమాజం, సంస్కృతిలో మనకు తెలియకుండానే చాలా భావాలు, మాటలు కులాన్ని, పరువుతో ముడిపెట్టి మాయ చేస్తాయి... మాయే ప్రణయ్ ని బాలి తీసుకుంది.....ఈ కులహత్యలకే  పరువు హత్య అనే ముసుగు వేసారు.... పరువు హత్యలు కొత్తేం కాదు కాకపోతే బయటికి పొక్కలేదు..కులరక్కసి పొరల్లో శిధిలమై పోయాయి... పరువు హత్యలు నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి....గతం లో మోత్కూరులో బలైన  ఒక స్వాతి-నరేష్ కథ. ఇప్పటికీ, ఎప్పటికీ ఎవరు మర్చిపోలేని విషాదం అది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి, నరేష్ ఎక్కడో దూరంగా వెళ్లి గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. తను మారిపోయానని, మీ పెళ్లిని అంగీకరిస్తానని పిలిపించి మరీ నరేష్‌ను స్వాతి తండ్రి చంపిన తీరు ఉలిక్కిపడేలా చేసింది. నరేష్ దారుణహత్యకు గురైతే... స్వాతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వాళ్లదీ కులాంతర వివాహమే. పెద్దల కులపిచ్చికి జంట చివరికలా బలైపోయింది. ఇప్పుడు ప్రణయ్ బలయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అమతృను ప్రేమ వివాహం చేసుకున్నాడు.చూడముచ్చటైన జంట. చింతా లేకుండా తమ సంసారమేదో తాము చేసుకుంటున్నారు.

            ఒకర్నొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడుపుతున్నవాళ్లను అలా వదిలేయకుండా పెద్దలు పరువు పరువంటూ పగబట్టారు. అగ్రకులానికి చెందిన తమ అమ్మాయిని తక్కువకులానికి చెందినవాడు పెళ్లి చేసుకోవడమేంటని కిరాతకంగా చంపేశారు.ఇలా ప్రతీ హత్యా సంచలనమే. పరువు, ప్రతిష్ట అన్న మాయలో పడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. అంతేకాదు... పేగుతెంచుకుపుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు. హత్యలన్నింటికీ కారణం ఒకటే. పరువు కాపాడుకోవడమే. ఇప్పుడు ప్రణయ్‌ని చంపినవాళ్లు జైలుకెళ్తారు. బెయిల్‌పై వస్తారు. కోర్టు శిక్ష వేస్తుంది. అనుభవించి చక్కగా కొన్నేళ్ళకు బయటికి వచ్చేస్తారు...ఒకసారి ఆలోచిస్తే నిజంగా మనిషి ప్రాణం తీసేస్తే పరువు తిరిగొస్తుందా? ఇప్పుడు అమృత పరిస్థితి ఏంటీ? ఆరు నెలల గర్భిణీ. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో క్షోభను ఎలా తట్టుకోగలదు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇక లేడన్న నిజాన్ని ఎలా జీర్ణించుకోగలదు? పరువు కోసం ప్రణయ్‌ని చంపారు. అమృతకు భర్తను దూరం చేసి ఆమె జీవితాన్ని కోలుకోలేని దెబ్బతీశారు.ఇప్పుడు అమృత బాగోగులు చూసేదెవరు? అంతేకాదు... పుట్టబోయే బిడ్డ పరిస్థితేంటీ? బిడ్డ లోకంలోకి వచ్చేసరికి తండ్రి లోకంలో ఉండడు. బిడ్డతో అమృత జీవితాన్ని ఎలా గడపాలి? క్షణికావేశమో... అనాలోచిత నిర్ణయమో... ప్లాన్ ప్రకారం చేసిన హత్యో... కారణం ఏదయితేనేం... తల్లీబిడ్డలకు మాత్రం ఇది అతిపెద్ద శాపమే. ఇలాంటి ప్రతి హత్య వెనుకా ఉన్నది కులమే. నగ్నసత్యాన్ని గుర్తించి, ఇవి పరువు హత్యలు కావు, కొందరి కుల బలుపు హత్యలు అని తెలుసుకోవాలి....ఏది ఏమైనా ఇపుడు అమృతకి కావలసింది ధైర్యం...ప్రణయ్ మళ్ళీ తన కడుపులో ఊపిరి పోసుకోవడం...ముఖ్యంగా తను ప్రశాంతంగా ఉండాలి...అలాగే జరగాలని మనం కూడా కోరుకుందాం...

Comments