ప్రణయ్ చనిపోయాడు గర్భం తీయించుకో అనిచెప్పిన తండ్రికి అమృత ఏం చేపిందంటే | Amrutha Pranay

      ప్రణయ్ చనిపోయాడు గర్భం తీయించుకో అనిచెప్పిన తండ్రికి అమృత ఏం చేపిందంటే

        నాన్న అంటే నమ్మకం.. ఆ నమ్మకమే బిడ్డ జీవితాన్ని చిదిమేస్తే ! నాన్న అంటే ధైర్యం.. ఆ ధైర్యమే దయ లేకుండా.. కన్న బిడ్డ విషయంలో కర్కశమైన నిర్ణయం తీసుకుంటే ! నాన్న అంటే భరోసా.. ఆ భరోసా.. బిడ్డ బతుకుని ఎడారి పాలు చేస్తే.. అది దారుణం. మనిషి అన్న వాడు ఎవ్వడూ చేయకూడని దారుణం. తండ్రి అన్న వాడు ఎవ్వడూ చెయ్యలేని దారుణం. అయితే అలాంటి దారుణం అవలీలగా చేసేశాడు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకి చెందిన మారుతీ రావు అనే ఓ కసాయి తండ్రి. కూతురు వేరే కులపు వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని అతి కిరాతకంగా అల్లుడిని పరువు హత్య చేయించిన ఈ తండ్రి దౌర్భాగ్యపు పని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 

        నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ప్రణయ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతోనే అల్లుడు ప్రణయ్‌ని అమ్మాయి తండ్రి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.పట్ట పగలే తన కళ్ల ముందే భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయడంతో అతని భార్య అమృత ఇంకా ఆ షాక్‌లోనే ఉంది. భర్తను చంపుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక గట్టిగ కేకలు వేస్తూ ఆమె పరుగులు తీసింది. గర్భిణి అయిన అమృతను మిర్యాలగూడ జ్యోతి ఆస్పత్రికి తీసుకువచ్చిన సందర్భంలో ప్రణయ్ హత్య జరిగిన విషయం తెలిసిందే. షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ప్రణయ్ భార్య అమృత మీడియాతో మాట్లాడారు. ‘ప్రణయ్‌ని హత్య చేయించింది మా నాన్నే. ప్రణయ్‌ని హత్య చేసేందుకు ఆయన చాలా రోజులు రెక్కీ నిర్వహించారు. నాన్న ఆలోచనల్ని అమ్మ నాకు చెప్పేది. మేం ఎక్కడికి వెళ్లినా అమ్మ ఫోన్ చేసి.. మీరు ఇప్పుడు బ్యూటీ పార్లర్ కు వెళ్లారు. ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారు ఇవన్నీ ఎప్పటికి ఎప్పుడు మీ నాన్నకి తెలిసిపోతున్నాయి అని చెప్పేది. దాంతో నాన్న మాపై నిఘా ఉంచారని అర్థమైంది. నాన్న పురమాయించిన వ్యక్తి నాన్నకు మా గురించి కాల్ చేసి చెప్పేవాడని అమ్మ చెబుతుండేది. 

             మేం ఎక్కడ ఉన్నా క్షణాల్లో మా నాన్నకు తెలిసిపోయేది. నేను ఐదు నెలల గర్భవతిననే విషయం ఈ మధ్య ఫోన్ చేసి అమ్మకు చెప్పా. నా ఆరోగ్యం గురించి అమ్మ వాకబు చేస్తుంటే.. నాన్న మాత్రం గర్భం తీయించుకోవాలని హెచ్చరించేవారు. గర్భం తీయించుకొని రెండేళ్లు ఇలానే కలసి ఉండండి. నేను పూర్తిగా మీ పెళ్లిని అంగీకరిస్తాను అనేవారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. ఈ క్రమంలో చెకప్ కోసం మిర్యాలగూడలో హాస్పిటల్‌కు వచ్చాం. ప్రణయ్, నేను హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో ప్రణయ్‌పై దాడి చేయగా కిందపడిపోయాడు. కత్తితో నరికి ప్రణయ్‌ను హత్య చేసి పారిపోయాడంటూ’అమృత కన్నీటి పర్యంతమైంది. ఆరు నెలల క్రితం ప్రణయ్, తన కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రి మారుతిరావుకు నచ్చలేదు. నాటి నుంచి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా ప్రణయ్, అమృతను, మారుతీరావు బెదిరించారు కూడా. అయితే ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకున్నారని ప్రణయ్, అమృత గుర్తించలేకపోయారు. కుమార్తె తమ పరువు తీసిందని భావించిన మారుతీరావు, ఆయన సోదరుడు కిరాయి హంతకులకు 10 లక్షల రూపాయలిచ్చి ప్రణయ్‌ను హత్య చేయించారని పోలీసులు తేల్చారు. ప్రణయ్ మరణాన్ని అతడి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్యాలగూడలో విషాద వాతావరణం నెలకొంది. ఇప్పుడు స్పృహలోకి వచ్చిన అమృత మేం ఏం తప్పు చేశాం. ప్రేమించడం నేరమా.. పాపమా’ అంటూ అమృత ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

Comments