60 ఏళ్లగా నిమజ్జనం లేకుండా పూజలు అందుకుంటున్నవినాయకుడు ఎక్కడోతెలుసా? |

       60 ఏళ్లగా నిమజ్జనం లేకుండా పూజలు అందుకుంటున్నవినాయకుడు ఎక్కడోతెలుసా? 

          విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి గణపతి. అందుకే విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. దేవతాగణాలన్నింటికీ కూడా ఆయనే అధిపతి. విఘ్నాలను తొలగించటమే కాకుండా మనిషికి జీవితంలో కావలసిన విద్యలు, సిద్ధులు ఇచ్చేది కూడా గణపతే. గణపతి ప్రస్తావన మనకు అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో కనిపిస్తుంది. వేదకాలంలో గణపతితోపాటు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు ఇలా అనేక మంది దేవతలకు సమప్రాధాన్యం ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో గణపతికి తప్ప మిగతా దేవతలందరికీ చేసే ఆరాధన తగ్గుతూ వచ్చింది. కేవలం గణపతి ఒక్కడే నాలుగు యుగాల్లోనూ పూజలందుకున్న విశిష్టుడు. కృత యుగంలో మహోద్ఘటుడు, త్రేతా యుగంలో మయూరేశుడు, ద్వాపర యుగంలో గజాననుడు, కలియుగంలో ధూమ్రకేతువుగా గణపతి పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు మనం పూజ చేస్తున్న గణపతి ద్వాపరయుగంలోని గజముఖుడే! 

        ప్రస్తుతం మనం విఘ్నాలు తొలగించే నాయకుడిగా గణపతిని కొలుస్తాం. దీనికొక కారణముంది. మన శరీరంలో అన్ని అవయవాలు ఏకోన్ముఖంగా పనిచేస్తాయి. అదే విధంగా ఒక పనిలో అనేక కోణాలుంటాయి. ఇవన్నీ విజయం దిశలో ప్రయాణించాలంటే గణపతి ఆశీర్వాదం అవసరం. అందుకే పెళ్లి, పూజ, పితృకార్యాలైన తద్దినాలు పెట్టాలన్నా ముందుగా గణపతిని పూజించాల్సిందే! అయితే అలాంటి వినాయకుణ్ణి నవరాత్రులు భక్తితో పూజించి ఆ తరువాత నిమజ్జనం చేయడం ప్రాచీనంగా మనకి ఆచారంగా వస్తుంది. అయితే వినాయక చవితి నాడు వైభవంగా మండపంలో ప్రతిష్టించిన వినాయకుడిని నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది? ఈ ధర్మ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చి ఉండదు ఎందుకంటే.. ఇప్పటి వరకు మనకి తెలిసి అసలు నిమజ్జనం చేయని వినాయక విగ్రహం ఎక్కడా లేదు. బొజ్జ గణపయ్యకి ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి.. నవ రాత్రుళ్ళు అయిపోయే వరకు భక్తి శ్రద్దలతో కొలిచి.. ఆ తరువాత నిమజ్జనానికి సాగనంపడమే అందరికి అలవాటు. అయితే 60 ఏళ్లుగా అస్సలు నిమజ్జనం కాకుండా ఓ వినాయక విగ్రహం పూజలు అందుకుంటున్న విషయం మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షర నిజం.

           మహా రాష్ట్రాలోని పాలజ్ చెక్కతో చేయబడిన ఈ స్వామిని చూడటానికి భక్తులు బారులు తీరుతారు. మహారాష్ట్రలోని పాలజ్ వాసులకి మాత్రం వినాయకచవితి అన్నా , వినాయక నవరాత్రులు అన్న చెక్కతో తయారు చేయబడిన ఆ వినాయకుడే గుర్తుకి వస్తాడు. ఆయన్నే తమ కష్టాలు తీర్చే స్వామిగా కొలుస్తారు. అందుకే 60 ఏళ్ళ క్రితం ఆ ప్రాంత పెద్దలు వినాయక చవితికి మండపంలో పెట్టిన ఆ వినాయకుడికే వారు ఇంకా పూజలు చేస్తున్నారు. భక్తితో గుడి కట్టి, ఆ గుడిలోనే ఆయన్ని కొలుస్తున్నారు. అయితే మిగతా అన్ని దేవాలయాల వలె ఈ గుడిలో నిత్యం దీప ధూప నైవేద్యాలతో పూజలు జరుగుతుంటాయి అంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఈ ఆలయంలో గణేశుడు పూజలు అందుకునేది ఈ వినాయక నవరాత్రుల్లో మాత్రమే. మిగతా సమయంలో ఈ గుడి మూతబడే ఉంటుంది. ఆ 9 రోజులే వినాయకుని దర్శనం లభిస్తుండటంతో దేశం నలువైపుల నుండి భక్తులు ఆ గ్రామానికి తరలి వెళ్తుంటారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న పాలజ్ గ్రామంలో ఉన్న ఈ సంకఠ హరౌ గణపతి నమ్మిన భక్తులు అందరికి అంత ప్రత్యేకం. నిజానికి ఒక్క 1948 వరకు పాలజ్ గ్రామంతో పాటు ఆ పక్క గ్రామాల్లో కూడా వినాయక చవితి నవరాత్రులు అయిపోగానే గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. అయితే 1948 న ఆ ప్రాంతాలలో తీవ్రమైన కరువు వచ్చింది. ఇక ఆ సమయంలో పాలజ్ గ్రామంలో కలరా వ్యాపించి ఎక్కువుగా జన నష్టం జరిగింది. అయితే అంతక ముందు వినాయకచవితి నాడు.. మహా గణపతిని నీటిలో నిమజ్జనం చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుంది అని ఆ గ్రామ ప్రజలు విశ్వశించారు. అంతే ఒక స్వామిజి సలహాతో మంచి కలపని తీసుకొచ్చి 4 అడుగుల ఎత్తులో గణపతి విగ్రహాన్ని రెడీ చేపించారు. ఇక ఆ విగ్రహం ఎప్పటికి నిమజ్జనం చేయకూడదు అని ఉరి కట్టుబాటుగా పెట్టుకున్నారు. ఆ విగ్రహానికి గుడి కట్టారు. అలా అప్పటి నుండి వినాయక నవరాత్రుల్లో స్వామిని పూజించి.. నిమజ్జన కార్యక్రమం లేకుండానే.. గుడి తలుపులు మూసి వేస్తారు. సో ఏదేమైనా 60 ఏళ్లుగా నిమజ్జనం చేయకుండా ఓ గణపతి విగ్రహానికి పూజలు అందిస్తూ పాలజ్ గ్రామ ప్రజలు అందరిలో ప్రత్యేకంగా నిలిచారు అని చెప్పుకోవచ్చు.

Comments