గురువు విమానం ఎక్కితే ఈ పైలట్ ఏం చేశాడో చూడండి

See what the pilot did if the teacher left the plane

           గురువు విమానం ఎక్కితే ఈ పైలట్ ఏం చేశాడో చూడండి

            ఒక గురువు మాత్రమే ఈ దేశాన్ని ముందుకు నడిపించే సైనికులని తయారుచేయగలరు. ఒక గురువు మాత్రమే గొప్ప గొప్ప వాళ్ళని తయారుచేయగలరు. గురువు కొవ్వొత్తి లాంటి వారు. ఒక కొవ్వొత్తి వందల కొవ్వొత్తులను వెలిగించినట్టు ఒక గురువు వందల మంది జీవితాల్లో వెలుగు నింపుతారు. అతి సామాన్యులని అసామాన్య శక్తులుగా ఎదిగేందుకు తోడ్పతారు. జ్నానమ్, విజ్నానమ్, విద్య, సంస్కారం, క్రమశిక్షణ, బతుకుతెరువు ఇలా ఎన్నో నేర్పుతారు. ఈరోజు గురువు దగ్గర చదువుకున్న వాళ్ళందరూ విమానాల్లో తిరగచ్చు, కానీ గురువు మాత్రం విమానాల్ని చూస్తూ అందులో నా ప్రియ శిష్యుడు ఉన్నాడు అని సంతృప్తి చెందుతారు. తాను చీకట్లోనే ఉండచ్చు, కానీ శిష్యుల గుండెల్లో మాత్రం ఎప్పటికీ ఉంటారు. గురువు అంటే దైవంతో సమానం. ప్రతీ ఒక్కరికీ స్కూల్లో, కాలేజీల్లో ఫేవరెట్ టీచర్ ఉంటారు. ఎప్పుడైనా మనకి ఆ టీచర్ ఎదురైతే ఎలా ఉంటుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఇలాంటి ఫీలింగే ఒక శిష్యుడికి కలిగింది.

           అసలు కధలోకి వెళ్తే, టర్కీకి చెందిన ఒక పైలట్ తాను చిన్నతనంలో స్కూల్లో చదువుతున్న రోజుల్లో టీచర్ “ఒరేయ్ నువ్వు ఏమవుతావురా అని అడిగితే పైలట్ అవుతా అని సమాధానం ఇచ్చాడు. అనుకున్నట్టుగానే అతను పైలట్ అయ్యాడు. అనుకున్నది సాధించడంలో గొప్ప ఏముంది అనుకుంటే, అసలు అతను గొప్ప వాడు అవ్వడానికి పునాది వేసిన గురువుని గుర్తుపెట్టుకోవడమే కదా అసలు గొప్ప. ఈరోజుల్లో గురువుని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. ఆ చెప్పాడులే వెధవ చదువు...వాడు చెప్పకపోతే నేను ప్రయోజకుడ్ని కాలేనా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటోళ్ళ గురించి మనం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇక ఆ టర్కీ పైలట్ తన గురువు కోసం ఏం చేశాడో తెలుసా? తన గురువు తాను నడిపే విమానంలో ప్రయాణిస్తారని అప్పటివరకూ ఆ పైలట్ కి కూడా తెలియదు. విమానంలో ఒక సీట్లో ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అది గమనించిన ఆ పైలట్ వెంటనే ఒక అనౌన్స్ మెంట్ చేశాడు. “విమానంలో ఎడమ వైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి నా స్కూల్ టీచర్. నాకు చదువు చెప్పిన టీచర్. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి ఆయనే కారణం. అలాంటి ఆయన నేను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. 

           ఈ సందర్భంగా ఆయనకు గుర్తుండిపోయేలా ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాలని విమాన సిబ్బందిని కోరుతున్నాను” అని ఉద్వేగానికి లోనవుతూ ప్రకటన చేశారు. ఇది వినగానే ఆ టీచర్‌కి కన్నీళ్లు ఆగలేదు. పైలట్ చెప్పగానే విమానంలోని సిబ్బంది పుష్పగుచ్చాలు తీసుకొచ్చి ఆ టీచర్‌ను విష్ చేశారు. ఆ తర్వాత పైలట్ కూడా టీచర్ ను కలవడానికి క్యాబిన్ నుంచి వచ్చాడు. ఆయన్ను ప్రేమతో హగ్ చేసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటన చూస్తున్న తోటి ప్రయాణికులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. చప్పట్లు కొడుతూ పైలట్‌ ను అభినందించారు. దీన్ని కొందరూ ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. తన స్టూడెంట్ ఉన్నత స్థాయికి వెళ్తే వచ్చే ఆనందం, కోట్లిచ్చినా ఆ టీచర్ కి రాదు. ఏమీ ఆశించకుండా విద్య నేర్పేది ఒక్క గురువు మాత్రమే. అందుకే నా గురువుకి నేను సెల్యూట్ చెప్తున్నా. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం మా గురువులే. స్కూల్లో, కాలేజీల్లో నాకు పునాదులు వేశారు కాబట్టే నేనిలా ఉన్నాను. అందుకు నా గురువులకు పాదాభివందనాలు. మీకు కూడా మీ ఫేవరెట్ టీచర్, గురువు ఉండే ఉంటారు కదా. చదువు పరంగానే కాకుండా, వృత్తి పరంగా కూడా మనకి బతుకుతెరువు నేర్పించే గురువులు కూడా ఉంటారు. అలాంటి గురువుల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో తెలియజేయండి.

Comments