తండ్రి ప్రేమ విలువ ఎలాంటిదో తెలిస్తే కనీళ్ళు ఆగవు || Father and Daughter Loves Real Story

           కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు

           మనం కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవన్నీ నిజాలే అని నమ్మడానికి వీల్లేదు. ఒక్కోసారి మన కళ్ళు, చెవులు మనల్ని మోసం చేస్తాయి. సంఘటనలని దూరం నుంచి కళ్ళతో చూసిన వ్యక్తి చెప్పే మాటలని విని నిజం అనుకోకూడదు. అదే నిజం అనుకుని నిజం తెలుసుకోకుండా నిజాయితీ గల మనిషి మీద నిందలు వేయకూడదు. అసలు అక్కడ ఏం జరిగిందో, దూరం నుంచి చూసిన వాడికి ఏం కనబడిందో, ఏం అర్ధమయ్యిందో ఎవరికి తెలుసు? స్వయంగా మనిషి హృదయ లోతులోకి వెళ్ళి తెలుసుకుంటేనే కానీ నిజం తెలియదు. అలా నిజం తెలుసుకునే ప్రయత్నం చేయని రోజున అతని మీద ద్వేషం పెరుగుతుంది. అలా ద్వేషం పెంచుకున్న రోజున అతనితో దూరం పెరుగుతుంది. ఆ తర్వాత అతనితో ఉన్న బంధం దూరమైపోతుంది. అలా ఎవరో చెప్పిన మాటల్ని విని మోసపోయిన ఒక చిన్నారి, తన తండ్రిని చనిపోయే చివరి క్షణం వరకూ ద్వేషిస్తూనే ఉంది. నిజం తెలిసేసరికీ పరిస్థితి చేజారిపోయింది.

            భార్యా, భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళకి నాలుగేళ్ల చిన్న పాప ఉంది. చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. చాలా హ్యాపీగా ఉంటున్న వాళ్ళకి ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. భార్యకి కామెర్లు వచ్చి మంచాన పడడంతో భర్త డీలా పడిపోయాడు. నాలుగేళ్ల పాప అమ్మా, అమ్మా అంటూ ఏడుస్తుంది. బండి మీద వెళ్ళి డాక్టర్ ని వెంట తీసుకొచ్చాడు. డాక్టర్, ఆమెని పరీక్షించి భర్తని బయటకి పిలిచాడు. డాక్టర్ ఏం చెప్తాడో అని టెన్షన్ టెన్షన్ గా బయటకి వెళ్ళాడు. "sorry, మిస్టర్ మీ భార్య ఇక ఎక్కువ కాలం బతకదు" అని చెప్పేశాడు. ఆ మాట విన్న భర్త, ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయాడు. డాక్టర్, అతన్ని పైకి లేపి, నువ్వే ఇలా అయిపోతే నీ పాప పరిస్థితి ఏంటి? ఒక పని చెయ్....సిటీలో ఉన్న పెద్దాస్పిటల్ కి తీసుకెళ్లు. అక్కడ ఏమైనా పనవ్వచ్చు...కానీ బతుకుతుందని చెప్పలేను కానీ ఏమో ఒకవేళ బతికితే, నువ్వయితే ప్రయత్నం చెయ్ అని చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్. ఎలాగైనా తన భార్యని బతికించుకోవాలని తన బిడ్డని తన బంధువులకి అప్పజెప్పి భార్యని వెంట తీసుకుని సిటీ బయలుదేరాడు. సిటీ వెళ్లాలంటే పడవ ఎక్కి అవతలి ఒడ్డుకి వెళ్ళాలి. పడవలో పది మంది ఉన్నారు.

          భార్యని పడవ ఎక్కించి, తాను కూడా ఎక్కాడు. ఐతే, వెళ్తుండగా, మార్గం మధ్యలో విపరీతమైన గాలి వాన పడుతుంది. అనుకోకుండా పడవకి రంధ్రం పడింది. పడవలో ఉన్న వాళ్ళు కంగారుపడ్డారు. భయంతో కేకలు వేశారు. అదే సమయంలో ఖాళీగా వెళ్తున్న ఒక పడవ, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పడవ దగ్గరికి వచ్చింది. ఒక్కొక్కరుగా అందరినీ ఎక్కించుకున్నాడు పడవని నడిపే వ్యక్తి. లాస్ట్ లో భార్యా, భర్తలు మిగిలిపోయారు. ఐతే, వేరే పడవలో ఒకరికి మాత్రమే చోటు ఉంది. ఇద్దరినీ ఎక్కించుకుంటే పడవ మునిగిపోతుంది. దీంతో చేసేదేమీ లేక భర్త, భార్యని మునిగిపోతున్న పడవలోనే వదిలేసి తాను వేరే పడవలోకి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. తన కళ్ల ముందే తన భార్య మునిగిపోతుండడం చూసి తట్టుకోలేక ఏడ్చేశాడు. ఏడుస్తూనే ఇంటికెళ్ళాడు. "నాన్న అమ్మ ఏది", అని అమాయకంగా అడిగింది నాలుగేళ్ల పాప. అమ్మ, మనల్ని వదిలేసి ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది రా అంటూ పాపని పట్టుకుని ఏడ్చేశాడు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా తలచుకుని ఏడ్చేవాడు భర్త.

              భార్యని బతికించుకోలేకపోయాను, కూతురికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు నాన్న. అనుకున్నట్టుగానే బాగా కష్టపడి కూతురికి మంచి జీవితాన్నిచ్చాడు. బాగా డబ్బు సంపాదించాడు, సొంత ఇల్లు కొన్నాడు. తన కూతురికి ఏ లోటూ లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు కూతురు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. గడిచిన ఇన్నేళ్లలో ఆ అమ్మాయి తన నాన్నతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నాన్నంటే ద్వేషం. అమ్మని ఒక్కదాన్నే వదిలేసి వచ్చేశాడని, ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాది. అప్పటి నుంచి నాన్న మీద ద్వేషం పెంచుకుంది. నాన్నతో సరిగా మాట్లాడేది కాదు. నాన్నకి వండి పెట్టడం, ఆఫీస్ కి వెళ్ళడం ఇంతే. అంతకు మించి పెద్దగా పట్టించుకునేది కాదు. ఇలా సాగుతున్న ఆమె జీవితంలోకి ఒక కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడిని ఆ అమ్మాయి ఒకటే ప్రశ్న అడిగింది. ప్రేమ అంటే ఏమిటి అని? దానికి ఆ కుర్రాడు "చచ్చేవరకూ తోడుగా ఉండడం, చచ్చాక తోడుగా వెళ్ళడం" అని చెప్పాడు. ఆ మాటకి కళ్ళలో నీళ్ళు తిరిగాయ్ ఆ అమ్మాయికి. నిజమైన ప్రేమ ఇదే కదా, నాన్నది ప్రేమే కాదు అని అనుకుంది. ఆ అబ్బాయి లవ్ యాక్సెప్ట్ చేసింది. అలా కొన్ని రోజులు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఒకరోజు ఆమె నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.

             నాన్న, ఇంట్లో కూర్చుని భార్యని తలచుకుని బాధపడుతున్నాడు. ఇంతలో, కూతురు తన భర్తతో వచ్చి గుమ్మం ముందు నిలబడింది. నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని రండి అని లోపలకి పిలిచాడు. దానికి ఆ అమ్మాయి "మేము నీ ఆశీర్వాదం కోసం రాలేదు, ఇక నుంచి నా భర్తతో ఉంటాను అని చెప్పడానికి వచ్చాను" అని చెప్పింది. దానికి ఆ తండ్రికి గుండె పగిలినంత పని అయ్యింది. సరే, అమ్మ నీ ఇష్టం అని దూరం నుంచే ఆశీర్వదించగా, వాళ్ళు వెళ్ళిపోయారు. భార్య లేదు, కూతురు సరిగా ఉండేది కాదు, తన మీద ద్వేషంగా ఉన్నా కళ్ల ముందు తిరుగుతూ కనబడుతుండడంతో అదే చాలనుకునేవాడు ఆ నాన్న. భార్య మీద బాధ, కూతురు వదిలేసి వెళ్లిపోయిందన్న బెంగతో రోజూ కుమిలికుమిలి ఏడ్చేవాడు. రాను రాను ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఒకరోజు రాత్రి భార్యని గుర్తుచేసుకుని "లక్ష్మీ, నా బాధ్యత తీరింది. నువ్వు చెప్పినట్టే మన కూతురికి మంచి జీవితం ఇచ్చాను. నేను కూడా వస్తున్నాను" అంటూ కళ్ళు మూసి పడుకున్నాడు. అంతే, మళ్ళీ కళ్ళు తెరవలేదు. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు తలుపులు బద్ధలుకొట్టి చూడగా చనిపోయి ఉన్నాడు. వెంటనే తన కూతురికి కాల్ చేసి విషయం చెప్పారు. ఆమె వచ్చింది. చచ్చాడా? ఇదేదో ముందే చచ్చుంటే ప్రేమకి ఒక అర్ధం ఉండేది కదా అని మనసులో తిట్టుకుంది. ఆమె నాన్న అంత్యక్రియలు జరిగాయి. నాన్న లేడు కదా, ఇక ఇల్లెందుకు అని అమ్మకానికి పెట్టింది.

            ఇంట్లో సామాన్లని ఆమె ఇంటికి షిఫ్ట్ చేస్తుంటే నాన్న రాసుకున్న డైరీ కనబడింది. ఆ డైరీ తెరిచి చూడగానే ఆమె కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అందులో ఏం ఉందంటే, "లక్ష్మీ ఆ బోట్ లో ప్లేసు మనిద్దరిలో ఒకరికి మాత్రమే ఉంది. కాబట్టి నిన్ను వెళ్ళమని అన్నాను. నేను పోయినా పర్లేదు. నా గురించి ఆలోచించకు అని అన్నాను. దానికి నువ్వు "ఇంకొన్ని రోజులైతే నేను ఎలాగూ పోతాను, అది ఇప్పుడే ఎందుకు కాకూడదు" అని అన్నావ్. చాలా బాధ అనిపించింది. నేనూ నీతో పాటే వచ్చేస్తా, ఇద్దరం కలిసే చద్దాం అన్నాను. కానీ నువ్వు ఒప్పుకోలేదు. "అది కాదండి. మనిద్దరం పోతే మన కూతురు అన్యాయం అయిపోతుందని నన్ను బలవంతంగా వేరే బోట్ ఎక్కించావ్. అప్పుడు నేను ఎంత ఏడిచానో తెలుసా? లక్ష్మీ. నా ప్రాణం పోయినట్టు అనిపించింది లక్ష్మీ. వెంటనే నేను కూడా నీటిలోకి దూకి నీతో పాటు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ "మన కూతురిని ఏ లోటూ లేకుండా చూసుకోమని నా దగ్గర మాట తీసుకున్నావ్. దాని కోసం ఆలోచించి వెనక్కి తగ్గిపోయాను. నువ్వు చెప్పినట్టు అమ్మాయిని బాగా చదివించాను. మంచి భవిష్యత్తు ఇచ్చాను. నీకో విషయం తెలుసా, మన అమ్మాయి నా స్నేహితుడు కొడుకుని పెళ్లి చేసుకుంది. అతను మంచి పిల్లాడు.

               మన అమ్మాయిని బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది. ఇక నా బాధ్యత పూరయ్యింది లక్ష్మీ. ఇక నేను నీ దగ్గరికి పయనమవుతున్నా" అంటూ రాసి ఉంది. అది చూసిన ఆ అమ్మాయికి కన్నీళ్లు ఆగలేదు. తన భర్తని నీకు మా నాన్న ముందే తెలుసా? అని అడిగింది. దానికి అతను, "తెలుసు. మీ నాన్న గారే నాకు జాబ్ ఇప్పించారు. తర్వాత బిజినెస్ పెట్టుకోవడానికి కావల్సిన అమౌంట్ ఇచ్చారు. అంతేకాదు, ఆస్తులన్నీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారు" అని చెప్పగానే నాకెందుకు ముందే చెప్పలేదు అని భర్త షర్ట్ పట్టుకుని ఏడుస్తూ అడిగింది. ప్రేమించిన మనిషి చనిపోతున్నప్పుడు పడే బాధ నువ్వు పడకూడదనే నీకు చెప్పద్దొన్నాడు మీ నాన్న. అందుకే నేను చెప్పలేదు" అనగానే ఆ అమ్మాయి కుమిలికుమిలి ఏడ్చేసింది. నాన్నని ఇన్నాళ్ళు అపార్ధం చేసుకున్నాను, అని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యింది. చూసారా, ఎవరో చెప్పిన మాట విని ఈ అమ్మాయి ఒక మంచి నాన్నని కోల్పోయింది. కాబట్టి ఎవరో వచ్చి నేను చూశాను, వాడి కేరెక్టర్ ఇది అని చెప్తే నమ్మకండి. ఎవరి మాటా వినకండి. మీ కళ్ళతో మీరు చూసి, మీరు స్వయంగా విని, మనిషి గుండెల్లోతులోకి వెళ్ళి మాట్లాడి మనిషిని అర్ధం చేసుకోండి. అంతేకానీ అపార్ధం చేసుకోకండి.

Comments